AP Heat Waves: ఏపీలో భానుడు భగభగలాడుతున్నాడు. శుక్ర, శనివారాల్లో అధిక ఉష్ణోగ్రతలు High Temparatureనమోదవుతాయని వాతావరణ శాఖ IMD హెచ్చరించింది. పగటి ఉష్ణోగ్రతలు 44డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా రాయలసీమ Rayalaseemaలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
మరోవైపు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు ప్రకటించారు. వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురంలలో 41నుంచి 43 డిగ్రీలు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో 41నుంచి 44 డిగ్రీలు, ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు తూర్పు గోదావరిలో 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 109 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు, 245 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది నెలకు కనీసం 10-12 రోజులు వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలతో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవుతోంది. వాతావరణ మార్పులతో పగటి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు వచ్చినట్టు ఐఎండీ స్పష్టం చేసింది.
గురువారం నంద్యాల జిల్లా యాగలబకంకిలొ 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా చిన్న చెప్పల్లిలో 43.9డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.8డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 21మండలాల్లో తీవ్రంగాను, 97 మండలాల్లో మోస్తరు వడగాల్పులు ఉన్నాయి.
ఐఎండి సూచనల ప్రకారం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈసారి ఎక్కువ రోజులపాటు వడగాల్పులు వీయవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. ఈ సీజన్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శుక్రవారం ఏపీలోని 109 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 115 మండలాల్లో తీవ్ర, 245 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
శ్రీకాకుళం24 , విజయనగరం25, పార్వతీపురంమన్యం14, అల్లూరిసీతారామరాజు6, విశాఖపట్నం3, అనకాపల్లి16, కాకినాడ11, కోనసీమ1, తూర్పుగోదావరి9 మండలాలు ఉన్నాయి.
గురువారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 44.1°C, వైయస్సార్ జిల్లా చిన్నచెప్పల్లిలో 43.9°C, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.8°C, ప్రకాశం జిల్లా దరిమడుగు 43.6°C, అనంతపురం జిల్లా తెరన్నపల్లి 43.5°C, నెల్లూరు జిల్లా మనుబోలు, తిరుపతి జిల్లా చియ్యవరంలో 43.2°C, శ్రీసత్యసాయి జిల్లా కుటగుల్లలో 43.1°C అధిక ఉష్ణోగ్రతలు, 18 జిల్లాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 21 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 97 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.
డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం తెలంగాణ వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో 42డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 14 ప్రాంతాల్లో 43డిగ్రీలను దాటేసింది. 2016 తర్వాత ఈ ఏడాదే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
నేడు, రేపు తెలంగాణలో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదు కానున్నాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రోడ్లపైకి రావొద్దని సూచిస్తున్నారు.
నల్గొండ జిల్లా ఇబ్రహీంపట్నంలో 43.5 డిగ్రీలు, కనగల్‌లో 43.4డిగ్రీలు, వడ్డేపల్లిలో 43.3 డిగ్రీలు, నల్లగొండ జిల్లా మాడుగుల పల్లి, గద్వాల జిల్లా ధరూర్, కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో 43.3 డిగ్రీలు, నల్గొండ జిల్లా బుగ్గబావిగూడ, సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో 43.2డిగ్రీలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా నాంపల్లి, గద్వాలలోని ద్యాగదొడ్డి, ఆదిలాబాద్ ఆర్లి(టి), కుమురం భీం జిల్లా వంకులంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
సంబంధిత కథనం