Vja Cock Fights: బెజవాడలో బరి తెగించారు.. జూదాన్ని అడ్డుకున్న పోలీసులపై దాడి చేసిన బెట్టింగ్ మాఫియా
Vja Cock Fights: పండుగ మాటున బెజవాడలో మూడ్రోజుల పాటు బెట్టింగ్ మాఫియా రెచ్చిపోయింది. విజయవాడ నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే అండతో పెద్ద ఎత్తున నగర శివార్లలో కోడి పందాలను నిర్వహించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి చీకటి పడిన తర్వాత జూదాన్ని అడ్డుకున్న పోలీసులపై తిరగబడి దాడి చేశారు.
Vja Cock Fights: విజయవాడలో పందెం రాయుళ్లు రెచ్చిపోయారు. పోలీసులపై తిరగబడి దాడి చేశారుర. పందాల నిర్వహణకు లక్షల్లో లంచాలు చెల్లించినా అడ్డుకోవడం ఏమిటంటూ ఎస్సైపై తిరగబడ్డారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. నగరంలో రేషన్, మట్టి తవ్వకాల్లో ఆరితేరిన ముఠాలు సంక్రాంతి సందర్భంగా ఓ రాజకీయ నాయకుడి అండతో విజయవాడ రూరల్ పరిధిలోని జక్కంపూడి, పాముల కాల్వ ప్రాంతాల్లో కోడి పందాలను నిర్వహించారు. వీటిని అడ్డు కోకుండా ముందుగానే స్థానిక పోలీసులతో ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం ఉంది. బుధవారం రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాత కూడా పందాలు నిర్వహిస్తుండటంతో పోలీసులు వాటిని అడ్డుకున్నారు.
విజయవాడ నగరానికి ఓ ఎమ్మెల్యే అనుచరులు నగర శివార్లలో పందాలను నిర్వహించారు. కోడి పందాలు, గుండాట జరిగే వైపు పోలీసులు రాకుండా ముందే ఒప్పందం చేసుకున్నారు. బుధవారం రాత్రి 7గంటల తర్వాత టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై హరిప్రసాద్ సిబ్బందితో జూదం ఆడుతున్న వారిని అడ్డుకున్నారు. పందాలు ఆపేయాలని హెచ్చరించారు. దీంతో అప్పటికే పందాల్లో ఉన్నవారు పోలీసులపై తిరగబడ్డారు. పోలీసులు శిబిరాన్ని మూసి వేయాలని హెచ్చరించడంతో అప్పటికే జరుగుతున్న పందాల డబ్బులు వెనక్కి ఇవ్వమని నిర్వాహకులు చెప్పడంతో వివాదం మొదలైనట్టు తెలుస్తోంది.
విజయవాడ నగరంలో మునుపెన్నడు లేని విధంగా ఈ ఏడాది బహిరంగంగానే కోడి పందాలను నిర్వహించారు. నగర శివార్లలో ఉన్న గ్రామాల్లో పందాలు బరులు ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహించారు. పందాల నిర్వహణను చూసి చూడనట్టు వదిలేయాలని ఉన్నత స్థాయిలో వచ్చిన ఆదేశాలతో పోలీస్ సిబ్బంది కూడా వాటి జోలికి పోలేదు.
నగరంలో మట్టి,రేషన్ మాఫియాలను నడిపించే ముఠాలు జక్కంపూడి ప్రాంతంలో పందెం బరుల్ని ఏర్పాటు చేశాయి. పోలీసులతో ఒప్పందం చేసుకున్నామనే ధైర్యంతో మూడు రోజులు పెద్ద ఎత్తున పందాలు నిర్వహించారు. కోడి పందాలతో పాటు గుండాట ఇతర జూద క్రీడల్ని యథేచ్ఛగా నిర్వహించారు. నగరాన్ని ఆనుకుని ఉండటంతో ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. మద్యాన్ని ఏరులై పారించారు. జనరేటర్లు పెట్టి విద్యుత్ సరఫరా చేసి తెల్లవార్లు పందాలు నిర్వహించారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం నైట్ రౌండ్స్‌కు వచ్చిన ఎస్సై హరిప్రసాద్‌పై పందెం రాయుళ్లు తిరగబడ్డారు. ఓ దశలో ఎస్సైను చుట్టుముట్టి దాడి చేసేందుకు సిద్ధపడ్డారు.
ఈ తతంగం మొత్తం పందాలు చూడ్డానికి వచ్చిన వారు వీడియోలు తీయడంతో వైరల్‌గా మారింది. పోలీసుల తీరుతోనే వారిపై దాడి చేసే పరిస్థితి వచ్చిందనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. విజయవాడలో క్రిమినల్ ముఠాలు, రేషన్ బియ్యం, అక్రమంగా మట్టి తవ్వకాలు చేసే వారితో పోలీసులు కుమ్మక్కు కావడంతో వారి నెలవారీ మామూళ్లతో వారి అక్రమాలకు అండగా నిలవడంతో పోలీసుల్ని ఖాతరు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలకు నగరంలో ఎక్కడేమి జరుగుతుందో తెలిసినా వాటిని ఉన్నతాధికారులకు నివేదించకుండా గుట్టుగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా మట్టి, రేషన్ బియ్యం తరలించే ముఠాలతో అంటకాగడంతోనే పోలీసుల్ని వారు ఖాతరు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. బుధవారం రాత్రి పోలీసులపై జరిగిన దాడిలో కూడా ఈ ముఠాలే కీలక పాత్ర పోషించాయి. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులపై దాడి జరిగినా తోపులాట మాత్రమే జరిగిందనే కవరింగ్ ఇస్తున్నారు. పోలీసులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.