Sankranthi Kodi Pandalu : పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి రూపాయల కోడి పందెం.. ఇది చాలా స్పెషల్ గురూ!
Sankranthi Kodi Pandalu : ఏపీలో కోడి పందాల జోరు నడుస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పందెం కోళ్లు కాళ్లకు కత్తులు కట్టుకొని కాలు దువ్వుతున్నాయి. అటు పందెంరాయుళ్లు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా.. కోడి పందాలపై భారీగా బెట్టింగ్ పెట్టారు. ఏకంగా కోటి రూపాయలకు పైగా పందెం కాశారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోటి రూపాయలు పందెం కాశారు. గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజును, రాతయ్య రసంగి పుంజును బరిలో దింపారు. కోటి 25 లక్షలతో రెండు పుంజులను నిర్వాహకులు బరిలోకి దింపారు. కోటి రూపాయల పందాన్ని వీక్షించడానికి పందెం రాయళ్లు భారీగా తరలివచ్చారు. హోరా హోరిగా సాగిన పోరులో.. గుడివాడ ప్రభాకర్ (నెమలి పుంజు) విజతగా నిలిచారు.

లక్షల రూపాయల పందెం..
భోగి, సంక్రాంతి రోజుల్లో జోరుగా సాగిన కోడి పందాలు.. కనుమ రోజు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. లక్షల రూపాయలు పందెం కాస్తున్నారు. ఈ పందాలను చూడటానికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. పలుచోట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు.
నిర్వాహకుల దోపిడీ..
కోడి పందాలు చూడటానికి వచ్చిన వారిని నిర్వాహకులు దోచుకున్నారు. కారు పార్కింగ్ మొదలు.. ఆహార పధార్థాల వరకూ అన్నింటినీ డబుల్ రేట్లకు విక్రయించారు. కృష్టా జిల్లా కంకిపాడు మండలంలో ఓ చోట ఏకంగా కారు పార్కింగ్ ఫీజు రూ.200 వసూలు చేశారు. మరోవైపు బరుల దగ్గర మద్యం ఏరులై పారుతోంది. పండగ సీజన్ కావడంతో.. పోలీసులు కూడా చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే టాక్ ఉంది.
జిల్లాలకు పాకిన ట్రెండ్..
గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిన ఈ కోడి పందాల కల్చర్.. ఇప్పుడు చాలా జిల్లాలకు పాకింది. ఒకప్పుడు సరదాగా సాగిన కోడి పందాలు.. ఇప్పుడు మంచి బిజినెస్ అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే చాలామంది కోళ్లను పెంచడం, వాటిని విక్రయించడం, బరులు నిర్వహించడం ద్వారా కోట్లాది రూపాయలు కూడబెడుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.
నిర్వాహకుల వాటా..
నిర్వాహకులు కోళ్ల పందెం కట్టినందుకు కొంత, గెలిచిన వారి నుంచి కొంత వాటా తీసుకుంటున్నారు. అంతేకాకుండా బరుల వద్ద సైకిల్, టూవీలర్ పార్కింగ్ నుంచి మద్యం, ఇతర దుకాణదారుల వరకు పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో పందాల పేరుతో సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కోట్లాది రూపాయలు..
కోడి పందాలను చూడటానికి, పందాలు కాయడానికి ఏపీలోని ఇతర జిల్లాలతో పాటు.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి సినీ నటులు, బడా వ్యాపారులు గోదావరి జిల్లాలకు వస్తున్నారు. కేవలం పండగ రోజుల్లోనే కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనే టాక్ ఉంది. ఈ ఏడాది.. 12 నుంచి 15 వరకు నాలుగు రోజులు కోడి పందేల నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లు చేశారు.