BC Corporation Loans: బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పెంపు.. ఈ నెల 12 వరకూ దరఖాస్తుల స్వీకరణ-bc corporation loan application deadline extended applications accepted until the 12th of this month ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bc Corporation Loans: బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పెంపు.. ఈ నెల 12 వరకూ దరఖాస్తుల స్వీకరణ

BC Corporation Loans: బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పెంపు.. ఈ నెల 12 వరకూ దరఖాస్తుల స్వీకరణ

Bolleddu Sarath Chandra HT Telugu
Published Feb 07, 2025 12:34 PM IST

BC Corporation Loans: ఏపీలో బీసీ కార్పోరేషన్ ద్వారా బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందించే రుణాలకు దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్టు మంత్రి సవిత ప్రకటించారు.ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.ఇప్పటికే స్వయం ఉపాధి రుణాలకు ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు.

బీసీ రుణాల మంజూరులో వేగం పెంచాలని మంత్రి సవిత ఆదేశం
బీసీ రుణాల మంజూరులో వేగం పెంచాలని మంత్రి సవిత ఆదేశం

BC Corporation Loans: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెనుకబడిన కులాలు, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు అందిస్తున్న బీసీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు గడువును పొడించారు. బీసీ కార్పొరేషన్‌ రుణాలను అర్హులందరికీ అందజేయాలని, గడువులోగా యూనిట్లు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి ఎస్.సవిత సూచించారు.

లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సహా వివిధ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న యూనిట్లకు దరఖాస్తుల గడవును ఈ నెల 12 వ తేదీన వరకూ పెంచుతున్నట్లు వెల్లడించారు.

గొల్లపూడిలో ఉన్న బీసీ భవన్ లో రాష్ట్రంలో వివిధ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో రుణాలు-సద్వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ, వెనుకబడిన తరగతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు.

2024-25 ఆర్థిక సంవత్సరం మరో 2 నెలల్లో ముగియనుండటంతో , తక్షణమే అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు మాత్రమే ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రభుత్వం అందజేసే ఆర్థిక చేయూతను వినియోగించుకునేలా లబ్ధిదారుల్లో చైతన్యం కలిగించి, తక్షణమే యూనిట్లు గ్రౌండింగయ్యేలా చూడాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కార్పొరేషన్లకు విధులతో పాటు నిధులు కూడా కేటాయించామన్నారు.

12 వరకూ దరఖాస్తుల గడువు పెంపు

లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పనకు స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువును ఈ నెల 12 తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఇదే విషయమై జిల్లాల్లో లబ్ధిదారులకు సమాచారమందించాలని సూచించారు.

కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యం చోటుచేసుకోకుండా తహసీల్దార్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. రాబోయే బడ్జెట్ లో బీసీ కార్పొరేషన్ల మరింత నిధులు కేటాయించేలా కృషి చేస్తామన్నారు. కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు వ్యక్తం చేసిన సమస్యలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సవిత హామీ ఇచ్చారు.

భారీగా దరఖాస్తులు

బీసీ కులాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు స్వయం ఉపాధి కల్పనకు రాయితీ రుణాల పథకానికి భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. ఆయా జిల్లాల్లో ప్రభుత్వం నిర్దేశిం చిన లక్ష్యం కంటే రెండు, మూడు రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి.

ఎమ్మెల్సీ ఎన్నికలు లేని రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అర్హుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటివరకు బీసీల నుంచి 55,100 మంది రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గాలలో ఈబీసీ, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ కులాలకు చెందిన 3,497 మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. జనరిక్ దుకాణాల ఏర్పా టుకు 220 మంది బీ ఫార్మసీ పూర్తిచేసిన వారు ఈ పథకంలో దరఖాస్తు చేశారు.

బీసీలకు రాయితీ రుణాల మంజూరుకు రూ. 896 కోట్లు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రూ.384 కోట్ల మేర బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టలేదు. మిగిలిన జిల్లాల్లో ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది.

ఇవి అర్హతలు…

ప్రభుత్వ రాయితీ రుణాల పథకానికి దారిద్య్రరేఖకు దిగువన ఉండి, 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. బీసీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు యూనిట్ ఏర్పాటుకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు మూడు స్లాబుల్లో రాయితీ రుణాలు మంజూరు చేయనున్నారు. ఇందులో ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తారు. మిగతా మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా మంజూరు చేస్తారు. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు బ్యాంకర్లతోనూ సమావేశాలు నిర్వహించారు.

రాయితీ రుణాల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 7న తుది గడువుగా ప్రభుత్వం నిర్దేశించగా తాజాగా దాన్ని 12 వరకు పొడిగించారు. ఆర్హులను గుర్తిం చేందుకు ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Whats_app_banner