Michaung Cyclone Landfall : బాపట్ల సమీపంలో తీరం దాటిన మిచౌంగ్ తుపాను, మరో 24 గంటలు భారీ వర్షాలు
Michaung Cyclone Landfall : మిచౌంగ్ తీవ్ర తుపాను బాపట్ల సమీపంలో తీరం దాటింది. తుపాను ప్రభావంతో తీరం వెంబటి గంటకు 90-100 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
Michaung Cyclone Landfall : ఏపీలో మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టించింది. తీవ్ర తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిచౌంగ్ తీవ్ర తుపాను బాపట్ల సమీపంలో తీరం దాటింది. మంగళవారం మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల రెండు గంటల్లో తీవ్ర తుపాను.... తుపానుగా బలహీనపడనుంది.
తీవ్రంగా పంటనష్టం
మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఉండి , భీమవరం, కాళ్ల ప్రాంతాల్లో తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కోతలు కోసిన రైతులు కల్లాల్లో ధాన్యం తడిసిపోయాయని ఆవేదన చెందుతున్నారు. ధాన్యం నానిపోయిందని, కోసిన వరి పనలు నీట మునిగాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వరి చేలు నేలకు ఒరిగి నీటి మునిగాయి. కలిదిండి, ఉండి, పెదపాడు, భీమవరం, పాలకొల్లు ప్రాంతాల్లో వరి చేలు నీట మునిగాయి. తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో పంటలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో మిరప, పొగాకు పంటలు ధ్వంసమయ్యాయి. అన్నమయ్య జిల్లాలో రాజంపేట, ఒంటిమిట్ట, సిద్ధవటం, పెనగలూరు, పుల్లంపేట మండలాల్లో ఉద్యాన పంటలు నష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో పూల పంటలు, బొప్పాయి, అరటి పంటలకు తీవ్ర నష్టం జరిగింది.
చిత్తూరులో వర్ష బీభత్సం
చిత్తూరు జిల్లా తూర్పు మండలాల్లో మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టించింది. కార్వేటినగరం, ఎస్‌ఆర్ పురం, గంగాధర నెల్లూరు మండలాల్లో వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సుమారు 15 గ్రామాలకు పైగా రాకపోకలకు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జలాశయంలో రెండు గేట్ల ఎత్తి వరద నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. కృష్ణాపురం జలాశయంలో ఒక గేటు ఎత్తి నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
రైతులు అధైర్యపడొద్దు- మంత్రి కారుమూరి
మిచౌంగ్ తుపాను బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం తణుకు నియోజకవర్గంలోని దువ్వ, వరిగేడు గ్రామాల్లో పర్యటించిన మంత్రి కారుమూరి వరి చేలను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ... ఎలాంటి పరిస్థితిలో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. వీలైనంత త్వరగా రైతులు తమ ధాన్యాన్ని అందుబాటులో ఉన్న మిల్లులకు తరలించాలని సూచించారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు విధాలుగానూ ధాన్యాన్ని తరలించే అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. ఏ మిల్లర్లు అయినా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.