AP Schools : ఇక నుంచి ప్రభుత్వ పాఠశాల్లో ఆ కార్యక్రమాలు నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
AP Schools : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో రాజకీయ, మత, వివాహా కార్యక్రమాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇటువంటి కార్యకలాపాల కోసం పాఠశాల ప్రాంగణాలల్లో అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించేవారు. విద్యాయేతర కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇప్పుడు రాష్ట్రం ప్రభుత్వం విద్యాయేతర కార్యక్రమాలపై నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వి.విజయ్ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు పంపారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో నిర్వహించకూడని అంశాలను తెలియజేస్తూ.. జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిర్వహణలో ఉన్న పాఠశాల ప్రాంగణంలో.. రాజకీయ, మత, వివాహాలు వంటి కార్యకలాపాలపై పాఠశాల విద్యా శాఖ నిషేధం విధించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు (ఆర్‌జేడీ), జిల్లా విద్యాశాఖ అధికారుల(డీఈవో) దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొంత మంది ఆర్‌జేడీలు, డీఈవోలు, ప్రధానోపాధ్యాయులు.. ప్రభుత్వ మేనేజ్‌మెంట్ పాఠశాల ప్రాంగణంలో అనుమతి ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
పాఠశాల ప్రారంభ సమయానికి ముందు, తరువాత, లేదా సెలవు రోజుల్లో ఇలాంటి కార్యకలాపాలకూ, ప్రైవేట్ ఈవెంట్‌లకూ కూడా పాఠశాలల ప్రాంగణాలు ఇవ్వడాన్ని తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తామని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)