Gudlavalleru Engg College: గుడ్లవల్లేరులో ఘోరం..! ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో రహస్య కెమెరాలు, అసలు ఏం జరిగిందంటే..
Gudlavalleru Engg College: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారంలో విస్తుబోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.గురువారం రాత్రి విద్యార్ధినుల ఆందోళనతో వెలుగు చూసిన రహస్య కెమెరాల వ్యవహారంలో కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టమైంది.వారం క్రితమే వెలుగు చూసినా తొక్కిపెట్టారు.
Gudlavalleru Engg College: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ బాత్‌రూమ్‌లలో విద్యార్థినుల రహస్య చిత్రీకరణ అంశం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో తవ్వే కొద్ది విస్తుబోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. బిటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి తన స్నేహితురాలితో కలిసి చేసిన చేష్టలతో విద్యార్థినులు బెంబేలెత్తిపోయారు.
శుక్రవారం తెల్లవారు జాము వరకు విద్యార్థినుల ఆందోళనతో కాలేజీ దద్దరిల్లి పోయింది. ఈ ఘటనలో బిటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థికి ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థినితో స్నేహం ఉంది. వీరిద్దరి మధ్య రెండేళ్లుగా స్నేహం కొనసాగుతున్నట్టు కాలేజీ విద్యార్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను తమ ఫోన్లలో రికార్డ్ చేసుకున్నారు.
రహస్య కెమెరాలు అమర్చినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి ఫోన్‌కు.. అతని స్నేహితురాలు ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కాలంలో ఇద్దరి మధ్య వీడియో కాల్స్ కూడా నడిచినట్టు తెలుస్తోంది. స్నేహితుడితో వీడియో కాల్స్ చేస్తున్న సమయంలో, యువకుడితో పాటు హాస్టల్ గదిలో ఉంటున్న ఇతర విద్యార్థులతో కూడా ఆ వీడియోలను షేర్ చేసుకున్నాడు.
కొద్ది రోజుల క్రితం ఈ వీడియోలు కాలేజీ విద్యార్థుల మధ్య సర్క్యూలేట్ అయ్యాయి. దీంతో గత వారం కాలేజీ యాజమాన్యానికి విద్యార్ధులు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని సామాజిక వర్గానికి చెందిన యువకులు యువకుడిపై దాడి చేయడంతో ఈ వ్యవహారం మొదట బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యం ఈ వ్యవహారాన్ని తొక్కి పెట్టింది. ఆ తర్వాత ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని గట్టిగా నిలదీయడంతో బాత్‌రూమ్‌లలో రహస్య కెమెరాల అంశం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. తన స్నేహితురాలి సహకారంతో వీడియోలను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. బాత్‌రూమ్‌లలో రికార్డ్ చేసిన వీడియోలలో ఇతర విద్యార్థినులు ఉన్నారని అనుమానించి కాలేజీ యజామాన్యానికి ఫిర్యాదు చేశారు. యువతితో ఉన్న వీడియోలు హాస్టల్ గదిలో ఉంటున్న ఇతర విద్యార్థులకు ఈ వీడియోలు చిక్కడంతో బయటకు పొక్కింది.
యువతుల వీడియోలను ముఖాలు కనిపించకుండా ఎడిట్ చేసి అశ్లీల సైట్లలో అప్‌లోడ్ చేశారని ప్రచారం జరిగింది. కొద్ది నెలల క్రితం జరిగిన ఈ వ్యవహారం యువకుడి ఫోన్‌లో ఉన్న పోటోలు, వీడియోలు బయటకు పొక్కడంతో వెలుగు చూసింది. యువకుడికి సహకరించిన ప్రకాశం జిల్లాకు చెందిన ఫైనలియర్ విద్యార్థిని బంధువులకు రాజకీయ నేపథ్యం ఉండటంతో వివాదాన్ని పెద్దది చేయకుండా చూడాలని కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో యువతి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రహస్య వీడియోలను చిత్రీకరించడంలో నిందితుడికి సహకరించడానికి కారణాలు ఆరా తీస్తున్నారు. రెండేళ్ల క్రితం యువతులతో సన్నిహితంగా ఉంటున్నాడనే అభియోగాలపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా మందలించి విడిచి పెట్టినట్టు తెలుస్తోంది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి తన స్నేహితురాలి సాయంతో మరికొంత మంది విద్యార్థుల్ని ట్రాప్ చేసినట్టు అనుమానిస్తున్నారు. అశ్లీల వెబ్‌సైట్లకు వీడియోలను విక్రయించేందుకు హాస్టల్ బాత్‌రూమ్‌లలో రహస్య కెమెరాలను ఏర్పాటు చేశారని సోషల్ మీడియాలో విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఆధారాలు లేవన్న ఎస్పీ…
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల లో నిన్న జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ ప్రకటించారు. బాలికల హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని, పోలీసులు నిందితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను విద్యార్థులు మరియు కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారన్నారు. నేరారోపణకు ఆధారంగా ఎలాంటి అంశాలు కనుగొనలేదన్నారు. విద్యార్థినులు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేసు విచారణలో ఉందని, ఈ నేరంలో తప్పు చేసిన వారిని గుర్తించి వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమేరాలు ఉన్నాయనే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. హాస్టల్ లో రహస్య కెమేరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని సిఎం ఆదేశించారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ లను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సంబంధిత కథనం