Durga Temple Lands: దుర్గమ్మకే శఠగోపం.. కారుచౌకగా దుర్గగుడి భూముల లీజుకు ప్రయత్నాలు, దేవాదాయ శాఖ అభ్యంతరం
Durga Temple Lands: విజయవాడలో కోట్లాది రుపాయల ఖరీదు చేసే దుర్గగుడి భూముల్ని కారు చౌకగా యాభై ఏళ్లకు లీజుకు ఇచ్చే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుత లీజు గడువు ముగియడంతో నామ మాత్రపు ధరకు మరో యాభై ఏళ్లకు పొడిగించాలని దేవాదాయ శాఖపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.
Durga Temple Lands: అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. బెజవాడ దుర్గమ్మకే శఠగోపం పెట్టేందుకు కొందరు సిద్ధం అయ్యారు. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న దాదాపు ఆరు ఎకరాల భూమి లీజును యాభై ఏళ్లకు పొడిగించేందుకు పావులు కదుపుతున్నారు.
నగరం మధ్యలో వందల కోట్ల ఖరీదు భూముల్లో నలభై ఏళ్ల క్రితం విద్యా సంస్థల్ని ఏర్పాటు చేశారు. ఈ భూముల లీజు గడువు ముగియడంతో వాటిని పొడిగించాలనే ప్రతిపాదనలు దేవాదాయశాఖకు చేరాయి. లీజు పొడిగింపుతో పాటు నామమాత్రపు రుసుము చెల్లించాలనే ప్రతిపాదనపై దేవాదాయశాఖ ఎస్టేట్స్ విభాగం అభ్యంతరం తెలిపింది.
లీజు ప్రతిపాదనలపై అభ్యంతరాలు…
విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం భూముల్లో ఉన్న లీజుల్ని పొడిగించాలని ప్రభుత్వ స్థాయిలో ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందడంతో దేవాదాయ శాఖ అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏడాదికి రూ.10లక్షల రుపాయల లీజుతో యాభై ఏళ్ల పాటు ఈ లీజును పొడిగించాలనే ప్రతిపాదనలు ఆ శాఖకు చేరాయి.
విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం భూముల్ని లీజుకు తీసుకున్న ఆరు ఎకరాల భూమి గడువు ముగిసింది. లీజును మరో యాభై ఏళ్లకు పొడిగించాలని విద్యా సంస్థ ప్రతిపాదనలతో దేవాదాయ శాఖ కార్యదర్శికి ఈ ప్రతిపాదనలు చేరాయి. విజయవాడ నగరం మధ్యలో ఉన్న ఖరీదైన భూములు కావడం, లీజు ద్వారా వచ్చే ఆదాయం భూముల విలువకు తగినట్టు లేకపోవడంతో ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడానికి దేవాదాయ శాఖ కార్యదర్శి సుముఖత చూపలేదు.
భూముల లెక్క తేల్చకుండానే…
విజయవాడ నగరంలో విద్యా సంస్థకు యాభై ఏళ్ల పాటు ఆరెకరాల లీజును పొడిగించాలనే ప్రతిపాదనలకు దేవాదాయ శాఖ అభ్యంతరం తెలిపింది. యాభై ఏళ్ల తర్వాత భూముల స్వాధీనత సాధ్యపడదని, ఇప్పటికే యాభై ఏళ్లుగా లీజులో ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసినట్టు దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. లీజును పొడిగించాలంటే మూడేళ్లకోసారి మాత్రమే పొడిగించాలని ఒకేసారి యాభై ఏళ్ల పాటు లీజు పొడిగించడం సరికాదనే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
తెరపైకి లీజులు, ఆదాయం అంశాలు..
విజయవాడ దుర్గగుడి భూముల లీజు వ్యవహారం తెరపైకి రావడంతో దేవాదాయ శాఖ భూములపై ఆ శాఖ కార్యదర్శి దృష్టి సారించారు. ఈ క్రమంలో గోదావరి జిల్లాల్లో ఓ లీజు అగ్రిమెంట్‌దారుడు ఏకంగా నాలుగు కోట్ల రుపాయలు బకాయి పడిన అంశం వెలుగు చూసింది. లీజుదారులు నిబంధనల ప్రకారం అద్దెలు చెల్లించకపోవడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నట్టు గుర్తించారు.
అదే సమయంలో దుర్గగుడి భూముల లీజు వ్యవహారంపై సీఎంఓ అధికారుల నుంచి దేవాదాయశాఖపై ఒత్తిడి పెరగడంతో భూముల వాస్తవ పరిస్థితిపై సమగ్ర సర్వే చేపట్టాలని దేవాదాయశాఖ కార్యదర్శి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దేవాదాయ భూముల వివరాలను డిజిటలైజ్ చేయాలని, లీజుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని, భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా సమగ్ర డేటా రూపొందించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆ శాఖ కార్యదర్శి ఆదేశించినట్టు తెలుస్తోంది.
సర్వేకు దేవాదాయ శాఖ వెనకడుగు…
విజయవాడ దుర్గ గుడి భూముల లీజును పొడిగించడానికి ముందే వాటిని సమగ్రంగా సర్వే చేయడంతో పాటు గతంలో లీజుకు ఇచ్చిన మేరకు అమ్మవారి భూములు ఉన్నాయో లేదో నిర్ధారించాలని ఎండోమెంట్ సెక్రటరీ దేవాదాయ శాఖ కమిషనర్‌కు సూచించినా అవి అమలు కాలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం దేవాదాయ శాఖ కమిషనర్ పదవిలో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నాన్ క్యాడర్ అధికారి ఉన్నారు. రెగ్యులర్ ఐఏఎస్ అధికారులు ఉండాల్సిన కీలకమైన పోస్టులో నాన్ క్యాడర్ అధికారిని నియమించడం వెనుక కొందరు చక్రం తిప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు దేవాదాయ శాఖ భూముల్ని గుర్తిస్తూ జిల్లాల్లో సర్వే చేపట్టాలంటే కలెక్టర్లను ఆదేశించాల్సి ఉంటుంది. కలెక్టర్లుగా ఉండే రెగ్యులర్ ఐఏఎస్ అధికారుల్ని ఆదేశించడానికి కమిషనర్ వెనకడుగు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
లీజు బకాయిలు వసూలు చేయడంలో తాత్సారం జరగడం, వందల కోట్ల ఖరీదు చేసే విజయవాడ దుర్గగుడి భూముల్ని సర్వే చేపట్టక పోవడం అనుమానాలకు తావిస్తోంది. దేవాదాయ శాఖ భూముల లీజును హడావుడిగా పొడిగించాలనే నిర్ణయం వెనుక ఉన్న వారు ఎవరనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే లీజు వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా తీసుకోవాల్సిన అంశాలను నోటి మాటతో పూర్తి చేయించడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఐఏఎస్ అధికారుల్లో భయం..
విజయవాడ దుర్గగుడితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైన ఆలయాలకు దాతలు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం కావడానికి ఇలాంటి విధానాలే కారణమని చెబుతున్నారు. లీజుల ద్వారా ప్రభుత్వానికి మార్కెట్ ధరల ప్రకారం రావాల్సిన ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరించడంపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
మరోవైపు దేవాదాయ శాఖలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం కమిషనర్‌లకు ఉంటుంది. వాటిని అమోదించడం వరకే సెక్రటరీ బాధ్యత కావడంతో వివాదాస్పద నిర్ణయాలకు అమోదించడానికి వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. న్యాయస్థానాల్లో కేసులు నమోదైతే సెక్రటరీలు బాధ్యత వహించాల్సి వస్తుందనే కారణంతోనే లీజుల వ్యవహారానికి సుముఖత చూపడం లేదని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.
సంబంధిత కథనం