Konaseema Crime: కోనసీమలో ఘోరం, నాగ దోష నివారణ పూజల పేరుతో యువతిపై అత్యాచార యత్నం
Konaseema Crime: కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువతి జాతకం చూసి నాగదోషం హోమం చేయాలన్నాడు. శనిదోష నివారణ పూజలని చెప్పి యువతను రమ్మని, ఆమెపై పూజారి లైంగిక దాడికి యత్నించాడు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Konaseema Crime: నాగదోషం నివారణ పేరుతో యువతిపై అత్యాచార యత్నం చేసిన ఘటన కోనసీమ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 31న జరిగిన ఈ ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.
రాజమండ్రి రూరల్ మండలంలోని కోలమూరు గ్రామానికి చెందిన యువతి తన వివాహం, ఉద్యోగం విషయంలో ఇబ్బందులు పడుతోంది. దీంతో తనకు తెలిసిన వారి ద్వారా జంగారెడ్డి గూడెం లలితాదేవి ఆలయంలో అర్చకత్వం చేస్తున్న కొత్తపేట మండలం మందపల్లి సమీపంలోని ఏనుగుల మహల్ గ్రామానికి చెందిన పండు పంతులు అనే శర్మను సంప్రదించింది.
ఆయన జాతకం చూసి నీకు నాగదోషం ఉందని యువతికి చెప్పాడు. హోమం చేయాలని అని చెప్పి రమ్మన్నాడు. అందుకు తేదీ కూడా ఆయనే నిర్ణయించాడు. తొలుత డిసెంబర్ 29న జంగారెడ్డిగూడెం లలితాదేవి ఆలయానికి రమ్మని చెప్పారుడ. ఆ తరువాత యువతికి ఫోన్ చేసి 29న వద్దని తేదీ, హోమం చేసే ప్రాంతాన్ని మార్చేశాడు.
డిసెంబర్ 29కి బదులు డిసెంబర్ 31న రమ్మని చెప్పాడు. జంగారెడ్డి గూడెం లలితాదేవి ఆలయానికి బదులు రావులపాలెం దగ్గర మందపల్లి శనైశ్చరస్వామి ఆలయానికి మార్చారు. అందుకు కారణంగా పూజారి చెబుతూ డిసెంబర్ 31న రావులపాలెం దగ్గర మందపల్లి శనైశ్చరస్వామి ఆలయంలో హోమం జరిపిస్తే ఇంకా మంచి జరుగుతుందని నమ్మబలికాడు.
శనైశ్చరస్వామి ఆలయానికి రమ్మని చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారం డిసెంబర్ 31న మధ్యాహ్నం ఆమె రావులపాలెంలోని దగ్గర మందపల్లి శనైశ్చరస్వామి ఆలయానికి వెళ్లింది. ఆమె ఆలయానికి చేరుకున్న తరువాత ఆమెకు శనిదోష నివారణకు హోమం చేయించారు. ఈ క్రమంలో ఆమె చేతులు పట్టుకుని హోమం చేయిస్తుండగా ఆమె ఇబ్బంది పడింది. తాను ఇబ్బంది పడుతున్నానని పూజారికి చెప్పింది. అయితే ఆయన ఈ హోమం, పూజ ఇలానే చేయించాలని, కనుక సహకరించాలని ఆయన అన్నారు. దీంతో ఆమె ఇబ్బంది పడుతునే పూజ చేసింది.
పూజ అనంతరం స్నానం చేయాలని ఆమెకు పూజారి చెప్పారు. దీంతో ఆమె స్నానం చేయడానికి బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. వెంటనే పూజారి బాత్‌రూమ్ లోపలకి చొరబడి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె గట్టి కేకలు, అరుపులు చేసి, ఆయనను బయటకు నెట్టేసింది. షాక్‌కు గురై ఆ యువతి భయంతో తిరిగి రాజమండ్రి వెళ్లి పోయింది. రాజమండ్రిలోని మహిళ పోలీస్ స్టేషన్‌కు, జంగారెడ్డి గూడెం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మొరపెట్టుకుంది. ఫిర్యాదు ఇచ్చిన తీసుకోలేదు.
ఆమెకు రాజమండ్రి మహిళ పోలీసులు, జంగారెడ్డి గూడెం పోలీసులు సహకరించలేదు. దీంతో కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేంద్ర మాట్లాడుతూ యువతి నుంచి ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేశామని తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు పూర్తి చేసి అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)