Pithapuram Ex MLA Varma : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి…!-attack on pithapuram ex mla svsn varma in kakinda district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pithapuram Ex Mla Varma : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి…!

Pithapuram Ex MLA Varma : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి…!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 07, 2024 10:40 PM IST

Pithapuram Ex mla SVSN Varma : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై దుండగులు దాడి చేశారు. గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రాళ్ల దాడిలో ధ్వంసమైన కారు
రాళ్ల దాడిలో ధ్వంసమైన కారు

Attack On Pithapuram Ex MLA SVSN Varma :  పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు.

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరికల కోసం వర్మ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనపై రాళ్ల దాడి జరిగింది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం టికెట్ ను జనసేన కోసం వర్మ త్యాగం చేశారు. ఈ సీటు నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై రికార్డు మెజారిటీతో గెలుపొందారు. ఏకంగా 70 వేల మెజారిటీతో పవన్ గెలుపొందారు. ఈ విజయం వెనక ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా కృషి చేశారు.

గతంలో ఈ టికెట్ త్యాగం చేసేందుకు వర్మను చంద్రబాబు ఒప్పించారు. కూటమి అధికారంలోకి వస్తే గౌరవమైన పదవిని ఇస్తానని హామీనిచ్చారు. పిఠాపురంలో పవన్ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. మొదట్లో సంశయించిన వర్మ… ఆ తర్వాత వెనక్కి తగ్గారు. పవన్ కు మద్దతు ప్రకటించటంతో పాటు… క్యాంపెయినింగ్ లో కీలకంగా పని చేశారు.

కూటమి బంపర్ విక్టరీ కొట్టి అధికారంలోకి వచ్చిన వేళ వర్మకు పదవి ఖాయమనే చర్చ జోరుగా జరుగుతోంది. కీలకమైన పదవే రావొచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన వేళ వర్మపై దాడి జరగటం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన వెనక ఎవరు ఉన్నారనేది తెలియాల్సి ఉంది….!