Tension at Amaravati : బీజేపీ నేత సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి
YCP vs BJP: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు వైసీపీనే కారణమంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ దాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
Attack On BJP National Secretary Satyakumar: అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా మందడంలో సభను నిర్వహించారు. రైతులకు మద్దతు తెలిపేందుకు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వచ్చారు. ఈ క్రమంలో బీజేపీ నేతల వాహనాలు సీడ్ యాక్సిస్ రోడ్డు వద్దకు రాగానే అక్కడ ఉన్న 3 రాజధానుల శిబిరం నుంచి పలువురు ఒక్కసారిగా అడ్డుతగిలారు. వాహనాలకు అడ్డంగా నిలబడి 3 రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ వాతావరణ నెలకొంది. ఈ క్రమంలో బీజేపీ నేతల కార్లపై దాడికి దిగారు. ఈ ఘటనలో సత్య కుమార్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు ఎంట్రీతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
వైసీపీపై సత్య కుమార్ ఫైర్...
ఈ ఘటనపై బీజేపీ నేత సత్య కుమార్ స్పందించారు. "అమరావతి ఉద్యమం 1200 రోజులకు చేరింది. వారికి మద్దతు గా సభలో పాల్గొని ప్రసంగించాను. జగన్మోహన్ రెడ్డి రాక్షస వికృత క్రీడ గురించి నేను మాట్లాడాను మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల్లో వైషమ్యాలు సృష్టించారు. జగన్ తన విధ్వంసక రచనను బిజెపి ప్రశ్నించింది. తిరిగి వస్తుండగా మూడు రాజధానుల శిబిరం వద్ద పోలీసులు భారీగా ఉన్నారు. నా కారును పోలీసులు ఆపగానే మూకుమ్మడిగా మా వాళ్ల మీదకు వచ్చారు. అసభ్యంగా బూతులు తిడుతూ... కర్రలు, రాళ్లతో దాడి చేశారు. డీఎస్పీని ఇదేంటని అడిగినా స్పందించలేదు. పోలీసులు కూడా మా వాళ్లనే వెనక్కి నెట్టారు. మేము ఆ మార్గంలో వస్తామని తెలిసి పథకం రచించారు. మా కారు ఆపగానే దాడికి తెగ బడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచివచ్చిన ఆదేశాలనే అమలు చేశారు. నందిగం సురేష్ అనే ఎంపి కొట్టిన వాళ్లకు సపోర్ట్ చేశారు. ఆదినారాయణ రెడ్డి తప్పించుకున్నాడని ఎంపి అన్నాడంటే అర్ధం ఏమిటి..? జగన్మోహన్ రెడ్డి ఒక్కటి గుర్తు పెట్టుకో... మీరే కాదు, మేము కడప జిల్లా నుంచే వచ్చాం. పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ డ్రామాలు ఎందుకు..? తేల్చుకునే పరిస్థితి వస్తే ధైర్యం గా దమ్ముగా రండి" అంటూ సత్య కుమార్ ఘాటుగా మాట్లాడారు.
బీజేపీ అల్లా టప్పా పార్టీ కాదనేది వైసీపీ తెలుసుకోవాలన్నారు సత్యకుమార్. తనపై దాడి జరిగిన విషయం తెలుసుకుని ఎంతో మంది ఫోన్లుచేశారని చెప్పారు. ఘటనపై డీజీపీకి కాల్ చేస్తే ఫోన్ ఎత్తటం లేదని... ఈ ఘటన పై కనీసం పోలీసులు స్పందించ లేదంటే ఏంటి అర్ధమని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మోసాలను ప్రశ్నిస్తే... దాడి చేస్తారా అని నిలదీశారు. ఈ విషయాలను తమ కేంద్ర పార్టీ సీరియస్ గా తీసుకుందని చెప్పారు. "పోలీసులు అంతమంది ఒకే సారి ఎందుకు ఉన్నారు..? వాళ్లు భౌతిక దాడి చేస్తుంటే.. మమ్మలను ఎందుకు అడ్డుకున్నారు. వైసీపీ నేతలకు తొత్తులుగా పనిచేసే పోలీసులు తగిన మూల్యం చెల్లించుకుంటారు. మా పార్టీ లో చర్చించి మా భవిష్యత్తు కార్యాచరణ చెబుతాం. ఈ విషయం పై సిఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాలి" అని సత్య కుమార్ డిమాండ్ చేశారు.
ఇక ఈ ఘటనపై స్పందించిన సోము వీర్రాజు... దాడిని ఖండించారు. వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.