Prakasam Crime: ప్రకాశం జిల్లాలో ఘోరం, విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ లైంగిక దాడి... పోక్సో కేసు నమోదు
Prakasam Crime: ప్రకాశం జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నెల రోజులుగా విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ట్యూషన్ మాస్టర్‌పై విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు.
Prakasam Crime: ప్రకాశం జిల్లాలో విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో వేటపాలెం మండలం ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ట్యూషన్‌కు వెళ్లిన విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం. వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. చల్లారెడ్డి పాలెం గ్రామానికి చెందని ఆవుల వెంకట ప్రసాద్ జాండ్ర పేట హైస్కూల్ దగ్గరలో ట్యూషన్ నడుపుతున్నాడు. ఈ ట్యూషన్‌కి దేశాయి పేట పంచాయతీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ కుమార్తెలు ఇద్దరు వెళ్తుంటారు.
అయితే చిన్న కూతురితో ట్యూషన్ మాస్టార్ నెల రోజులుగా అసభ్యంగా మాట్లాడుతూ శరీరంపై చేతులు వేస్తూ వేధింస్తున్నాడు. ఆదివారం కూడా ఇలాగే చేస్తూ ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. దీంతో బాలిక భయాందోళనకు గురైంది. ఏం చేయాలో తెలియక ఈ విషయాన్ని తన అక్కకు, తోటి బాలికలకు తెలిపింది. అందరూ కలిసి ట్యూషన్ మాస్టార్‌ను నిలదీశారు. ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో బాలిక తండ్రి వేటపాలెం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో ట్యూషన్ మాస్టార్ ఆవుల వెంకట ప్రసాద్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు.
తల్లి మందలించిందని 20 ఏళ్ల కుమారుడు ఆత్మహత్య
విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో పెందుర్తి గాంధీనగర్‌లో తల్లి మందలించిందని 20 ఏళ్ల కుమారుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మళ్ల అప్పారావు, రూప దంపతుల కుమారుడు భాను ప్రకాష్ (20) చదువు మధ్యలో ఆపేశాడు. పూర్ణా మార్కెట్‌లో పూల దుకాణం నిర్వహిస్తున్న తల్లి రూపకు సహాయంగా ఉండేవాడు. అయితే ఇటీవల భాను ప్రకాష్ జులాయిగా తిరగడంతో తల్లి తరచూ మందలిస్తుండేది.
శనివారం రాత్రి కూడా కుమారుడిని మందలించింది. ఈ నేపథ్యంలో గదిలోకి వెళ్లిన భాను ప్రకాస్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ కేవి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు ఆత్మహత్య చేసుకోవడతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. మందలించడమే తప్పైందా?, ఇలాంటి పనికి ఒడిగడతాడనుకుంటే మందలించేదాన్నే కాదంటూ తల్లి రోదనలు మిన్నంటాయి.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)