ATM Robbery: హైదరాబాద్‌ ఆదిభట్లలో నాలుగు నిమిషాల్లోనే ఏటీఎంలో చోరీ, రూ.30లక్షల నగదు అపహరణ-atm robbery rs 30 lakh cash stolen in four minutes in hyderabads adibhatla ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Atm Robbery: హైదరాబాద్‌ ఆదిభట్లలో నాలుగు నిమిషాల్లోనే ఏటీఎంలో చోరీ, రూ.30లక్షల నగదు అపహరణ

ATM Robbery: హైదరాబాద్‌ ఆదిభట్లలో నాలుగు నిమిషాల్లోనే ఏటీఎంలో చోరీ, రూ.30లక్షల నగదు అపహరణ

Sarath Chandra.B HT Telugu

ATM Robbery: హైదరాబాద్‌లో శివార్లలోని ఆదిభట్లలో నాలుగు నిమిషాల్లో ఏటీఎం పగుల గొట్టి నగదు చోరీ చేయడం కలకలం రేపింది. దాదాపు రూ.30లక్షల నగదుతో నిందితులు ఉడాయించారు. సీసీ కెమెరాలకు స్పే చేసి, అలారం ఆపేసి దుండగులు చోరీకి పాల్పడ్డారు.

ఆదిభట్ల ఏటిఎంలో భారీ దోపిడీ, రూ.30లక్షల చోరీ

ATM Robbery: హైదరాబాద్‌ శివార్లలోని ఆదిభట్లలో ఏటీఎం పగులగొట్టి రూ.30లక్షలతో ఉడాయించడం కలకలం రేపింది. నిందతులు పక్కా ప్రణాళికతో కారులో వచ్చి నింపాదిగా చోరీ చేసి వెళ్లిపోయారు. కేవలం నాలుగు నిమిషాల్లో ఏటీఎంను కొల్లగొట్టి పరారయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

ఆదిభట్ల పీఎస్‌ పరిధిలోని రావిర్యాల స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున 2:13 గంటలకు దుండగులు మాస్కులు ధరించి ఏటీఎం లోపలకు ప్రవేశించారు. లోపలకు రాగానే నల్లటి స్ప్రేను సీసీ కెమెరాలపై దృశ్యాలు రికార్డు కాకుండా చల్లారు. ఏటిఎం అల్లారం మోగకుండా వాటి కేబుళ్లను కట్ చేశారు.

నిందుతులు వెంట తెచ్చుకున్న కట్టర్, రాడ్లతో ఏటీఎం యంత్రాన్ని ను ధ్వంసం చేశారు. అందులో ఉన్న రూ.29.69లక్షల నగదు తీసుకెళ్లారు. ఏటిఎంలో నగదు ఉంచే ట్రేలతో సహా తీసుకెళ్లిపోయారు. ఏటిఎం వెలుపల సెక్యూరిటీ లేక పోవడంతో నిందితుల పని సులువైంది.

ఏటీఎంలో చోరీ ప్రయత్నం జరగ్గానే ముంబైలో దాని ప్రధాన కేంద్రానికి అలర్ట్‌ రావడంతో అక్కడి నుంచి రావిర్యాల శాఖ అధికారులుకు సమాచారం అందించారు. దీంతో రావిర్యాల బ్రాంచ్ మేనేజర్‌ పోలీసుల్ని అప్రమత్తం చేశారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన సమాచారంతో మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ రాజు, సీఐ రాఘవేందర్రెడ్డి ఏటిఎం కేంద్రాన్ని సందర్శించారు. బ్యాంక్ మేనేజర్ కొర్ర శ్రీవాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బ్యాంకు ఏటిఎంలో దోపిడీకి సంబంధించి మూడు బృందాలతో గాలింపు చేపట్టారు. దోపిడీ కేసును చేధించేందుకు పోలీసులు మూడు బృందాలను నియమించి గాలిస్తున్నారు. దుండగులు ఎక్కడ నుంచి వచ్చారు.. ఎటు వైపు వెళ్లారనే దానిపై ఆరా తీస్తున్నారు. గతంలో ఈ తరహా నేరాలకు పాల్పడిన వారి గురించి ఆరా తీస్తున్నారు. చోరీ తర్వాత ఆరంఘర్ వరకు నిందితుల కదలికను గుర్తించారు. బ్యాంకు చోరీలకు పాల్పడే అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అయ్యుంటుందని అనుమానిస్తున్నారు.

ఒకటవ తేదీన వేతనాలు చెల్లించే సమయం కావడంతో దృష్టిలో పెట్టుకొని మార్చి 28న ఏటీఎం క్యాష్‌ బాక్స్‌లో రూ.30 లక్షలు డిపాజిట్ చేసినట్టు సిబ్బంది వెల్లడించారు. ఆ తర్వాత ఏటీఎం ద్వారా రూ. 40 వేలు మాత్రమే విత్‌ డ్రా చేసినట్టు లెక్కల్లో నమోదైంది. నిందితులు మార్చి 2వ తేదీన మొత్తం నగదు ఊడ్చేశారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం