Atchutapuram Accident : అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు, 16 మంది మృత్యువాత- మృతులు వివరాలిలా-atchutapuram sez reactor blast 16 workers died cm chandrababu visit plant ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Atchutapuram Accident : అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు, 16 మంది మృత్యువాత- మృతులు వివరాలిలా

Atchutapuram Accident : అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు, 16 మంది మృత్యువాత- మృతులు వివరాలిలా

Bandaru Satyaprasad HT Telugu
Aug 21, 2024 10:28 PM IST

Atchutapuram Accident : అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ 16 మంది మృతి చెందగా, గాయపడిన వారి సంఖ్య భారీగా ఉంది. సీఎం చంద్రబాబు రేపు బాధితులను పరామర్శించనున్నారు.

అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు, 16 మంది మృత్యువాత- మృతులు వివరాలిలా
అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు, 16 మంది మృత్యువాత- మృతులు వివరాలిలా

Atchutapuram Accident : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని కెమికల్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలిన ఘటనలో మృత్యుల సంఖ్య 16కు పెరిగింది. బుధవారం మధ్యాహ్నం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో కార్మికులకు గాయపడ్డారు. గాయపడిన వారి స్థానిక ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని సమాచారం. కంపెనీ పరిసరాల్లో పొగ అలముకోవడంతో సహాయచర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. రియాక్టర్ పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగింది?

అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సుమారు 1:30 ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ప్రాణభయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు 300 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. అచ్యుతాపురం సెజ్‌ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కలెక్టర్‌తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. క్షతగాత్రుల తరలింపునకు అవసరమైతే ఎయిర్‌ అంబులెన్స్‌ వాడాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అధికారులను ఆదేశించారు.

రేపు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు రేపు(గురువారం) అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఎసెన్షియా పరిశ్రమలో పేలుడు సంభవించిన ప్రదేశాన్ని పరిశీలించనున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు పరామర్శించనున్నారు. అనంతరం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడనున్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం విశాఖ లేదా హైదరాబాద్ తలించాలని ఆదేశించారు.

మృతుల వివరాలు

ఈ ప్రమాదంలో చనిపోయినవారిలో 10 మందిని గుర్తించారు. వారి వివరాలు...వి. సన్యాసినాయుడు(ప్లాంట్ ఏజీఎం), రామిరెడ్డి(ల్యాబ్ హెడ్),హారిక (కెమిస్ట్), పార్థసారథి(ప్రొడక్షన్ ఆపరేటర్), వై. చిన్నారావు(ప్లాంట్ హెల్పర్), మోహన్(ఆపరేటర్), గణేష్(ఆపరేటర్), పి.రాజశేఖర్, హెచ్. ప్రశాంత్, ఎం. నారాయణరావు. మరో ఆరుగురిని గుర్తించాల్సి ఉంది. ఈ ఘటనపై కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కంపెనీ నిర్వాహకులు నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రియాక్టర్ పేలుడు ఘటనపై యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై సంబంధిత అధికారులతో ఫోన్‍లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో పలువురు చనిపోవడం బాధాకరం అని ఎమ్మెల్యే విజయ్ కుమార్ అన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఆప్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయచర్యలు చేపట్టాయి. పేలుడు ధాటికి మృతదేహాలు, శరీర భాగాల చెల్లాచెదురు కావడంతో రెస్యూ టీమ్స్ వాటి కోసం వెతుకుతున్నాయి.

సంబంధిత కథనం