Atchannaidu on NTR: ఎందుకు రాలేదో తారక్‌నే అడగాలన్న అచ్చన్నాయుడు
Atchannaidu on NTR: స్కిల్ డెవలప్‌మెట్ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పరామర్శించడానికి నటుడు ఎన్టీఆర్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తారక్ ఎందుకు రాలేదో తమకు తెలియదని అచ్చన్నాయుడు వ్యాఖ్యానించారు.
Atchannaidu on NTR: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైలుకెళ్లి ఐదు రోజులు గడిచిపోయాయి. ఆయన్ని అరెస్ట్ చేసిన సమయంతో కలుపుకుంటే నేటితో వారం పూర్తవుతోంది. చంద్రబాబు అరెస్ట్, 48 గంటల హైడ్రామా తర్వాత జైలుకు తరలించారు. ఆదివారం అర్ధరాత్రి 1.15కు రాజమండ్రి జైల్లో అడుగు పెట్టారు. నేటితో చంద్రబాబు ఐదు రోజుల జైలు గడుస్తోంది. హైకోర్టులో ఎలాంటి ఊరట దక్కకపోతే 22వ తేదీ వరకు రిమాండ్ తప్పదు. ఆ తర్వాత కూడా రిమాండ్ పొడిగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో సోమవారం నుంచి చంద్రబాబుతో కుటుంబ సభ్యులు భేటీ అవుతున్నారు. ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, బాలకృష్ణ, కోడలు బ్రహ్మణి ములాఖత్‌లో భేటీ అయ్యారు. చంద్రబాబు తరపు న్యాయవాది లుథ్రా కూడా ఆయనతో చర్చించారు.
మరోవైపు చంద్రబాబు నంద్యాలలో అరెస్టైన దగ్గర్నుంచి నేటి వరకు సినీ నటుడు ఎన్టీఆర్ స్పందించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళుతున్న దృశ్యాలు కూడా కనిపించాయి. ఎయిర్‌పోర్టులో ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి.
తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు కుటుంబంతో దగ్గరి బంధుత్వం ఉన్నా ఎన్టీఆర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడాన్ని టీడీపీ శ్రేణులు తప్పు పడుతున్నాయి. చంద్రబాబు జైలుకు వెళ్లినా ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌ల నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. కుటుంబంలో విభేదాలు ఉన్నా బాబు కష్ట కాలంలో అండగా నిలుస్తారని భావించిన టీడీపీ వర్గాలకు తారక్ వైఖరి అంతు చిక్కడం లేదు. 2009 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని వెళుతుండగా ఖమ్మం జిల్లాలో ప్రమాదం బారిన కూడా పడ్డారు.
ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా ఉండేవారు. 2013లో తన రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా చేశారు. 2014లో ఏపీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హరికృష్ణకు ఎలాంటి పదవి దక్కకపోవడంతో కుటుంబంలో దూరం పెరిగింది. ఆ తర్వాత హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీటితో పాటు కుటుంబంలో ఉన్న విభేదాల కారణంగా ఎన్టీఆర్‌కు చంద్రబాబు కుటుంబానికి మధ్య దూరం పెరిగింది.
తాజాగా చంద్రబాబు ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ ఎందుకు రియాక్ట్ కావటం లేదని అచ్చన్నాయుడిని మీడియా ప్రశ్నించడంతో తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. చంద్రబాబు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని, అవన్నీ స్వచ్ఛంధంగానే జరుగుతున్నాయని చెప్పారు.
బాబు విసంలో తారక్ ఎందుకు స్పందించడం లేదో ఆయన్నే అడగాలని అచ్చన్నాయుడు అన్నారు. అన్యాయంగా, ఆధారాలు లేని కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారని హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా స్వచ్ఛంధంగా బయటకు వచ్చి ఆందోళన చేశారని, బెంజిసర్కిల్‌లో మహిళలు కూడా స్వచ్ఛంధంగా ఆందోళన నిర్వహించారన్నారు. తాము ఎవరిని ఆందోళనలు చేయాలని కోరలేదని అచ్చన్నాయుడు చెప్పారు. ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడటం లేదో తమకు తెలియదని చెప్పారు.