Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - ఈనెల 6న శ్రీరామనవమి ఆస్థానం, మరికొన్ని ప్రత్యేక కార్యక్రమాలు-asthanam will be held at the tirumala temple on april 6 to celebrate the sri ramanavami festival 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - ఈనెల 6న శ్రీరామనవమి ఆస్థానం, మరికొన్ని ప్రత్యేక కార్యక్రమాలు

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - ఈనెల 6న శ్రీరామనవమి ఆస్థానం, మరికొన్ని ప్రత్యేక కార్యక్రమాలు

TTD Sri Rama navami Asthanam 2025 : శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ వివరాలను పేర్కొంది. ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం ఉంటుందని తెలిపింది. ఇక⁠ ⁠ఏప్రిల్ 7న శ్రీరామపట్టాభిషేకం నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

తిరుమల శ్రీవారి ఆలయం

శ్రీరామనవమి పర్వదినం నేపథ్యంలో శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయని వెల్లడించింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రత్యేక కార్యక్రమాలు…

ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అర్చకులు రంగనాయక మండపంలో, వేదమంత్రోచ్ఛరణల నడుమ అభిషేకం చేస్తారు.

ఇక సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు హ‌నుమంత వాహ‌నసేవ జరగనుంది. ఆ త‌రువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 07వ తేదీన శ్రీ రామ పట్టాభిషేకం ఉంటుంది.ఈ వేడుకను పురస్కరించుకుని… రాత్రి 8 నుంచి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 6 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు:

కడప జిల్లాలోని ఒంటిమిట్ట ఏకశిలానగరంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు.

అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 11.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.

మరోవైపు బ్రహ్మోత్సవాలకు టీటీడీ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 5న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం జరిపిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 7.30 నుంచి 9.30 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న సేవ‌లు జ‌రుగుతాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి….

వాహనసేవల వివరాలు :

  • 06-04-2025 : ఉదయం – ధ్వజారోహణం (ఉద‌యం 9.30 నుండి 10.15 గంట‌ల వ‌ర‌కు వృష‌భ‌ లగ్నం, రాత్రి – శేష వాహనం.
  • 07-04-2025 : ఉదయం – వేణుగానాలంకారము ఉంటుంది. రాత్రి హంస వాహనం నిర్వహిస్తారు.
  • 08-04-2025 : ఉదయం – వటపత్రశాయి అలంకారము, రాత్రి – సింహ వాహనం.
  • 09-04-2025 : ఉదయం – నవనీత కృష్ణాలంకారము, రాత్రి – హనుమంత వాహనం.
  • 10-04-2025 : ఉదయం – మోహినీ అలంకారము, రాత్రి – గరుడసేవ.
  • 11-04-2025 : ఉదయం – శివధనుర్భాణ అలంకరణ, రాత్రి – కళ్యాణోత్సవము/ గజవాహనము.
  • 12-04-2025 : ఉదయం – రథోత్సవం.
  • 13-04-2025 : ఉదయం – కాళీయమర్ధనాలంకారము, రాత్రి – అశ్వవాహనం.
  • 14-04-2025 : ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం