గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు.. టీడీపీ సీనియర్ నేతకు అవకాశమిచ్చిన కేంద్రం!-ashok gajapathi raju appointed as goa governor see details inside ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు.. టీడీపీ సీనియర్ నేతకు అవకాశమిచ్చిన కేంద్రం!

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు.. టీడీపీ సీనియర్ నేతకు అవకాశమిచ్చిన కేంద్రం!

Anand Sai HT Telugu

గోవా గవర్నర్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజు నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు

టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమిలో భాగంగా ఉంది. అందులో భాగంగానే అశోక్ గజపతి రాజుకు అవకాశం ఇచ్చినట్టుగా అర్థమవుతోంది. మరోవైపు హర్యానా, గోవాలకు కొత్త గవర్నర్లను, కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌కు కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రాష్ట్రపతి భవన్ నుండి వచ్చిన ప్రకటన ప్రకారం.. ప్రొఫెసర్ అశిమ్ కుమార్ ఘోష్ హర్యానా గవర్నర్‌గా నియమితులయ్యారు. పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. జమ్మూ కశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవిందర్ గుప్తాను లడఖ్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు.

పూసపాటి అశోక్ గజపతి రాజుకు సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉంది. గతంలో ఏపీలో మంత్రిగా, కేంద్ర మంత్రిగా పని చేశారు. 2014ల మోదీ ప్రభుత్వ హయాంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. అశోక్ గజపతి రాజు విజయనగరం సంస్థానానికి చెందిన రాజవంశీకులు. ఒకసారి ఎంపీగా, ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు మంత్రిత్వశాఖలు చూసుకున్నారు. సింహాచలం ఆలయ దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. విజయనగరం రాజవంశం చివరి మహారాజ పూసపాటి విజయరామ గజపతిరాజు కుమారుడు అశోక్ గజపతిరాజు. 2024 ఎన్నికల సమయంలో అశోక్ గజపతి రాజు ఎన్నికలు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.