CBN Vs Jagan: ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు, జగన్, చంద్రబాబులలో ఎవరి వ్యూహం నెగ్గినట్టు…
CBN Vs Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాలుగు నెలల తర్వాత 2024-25లో చివరి నాలుగు నెలల కాలానికి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎనిమిది రోజుల బడ్జెట్ సమావేశాల్లో ఎవరి వ్యూహం నెగ్గిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
CBN Vs Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగియ నున్నాయి. సభకు వెళ్లినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించకపోతే తమకు మాట్లాడే అవకాశం రాదు కాబట్టి సమావేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని వైసీపీ సమావేశాలను బహిష్కరించింది. దీంతో విపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. మండలిలో వైసీపీకి బలం ఉండటంతో బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ పార్టీ తరపున పోటీ చేసిన వారిలో కేవలం 11మంది సభ్యులు మాత్రమే గెలుపొందారు. ఎన్డీఏ కూటమి తరపున 164మంది గెలుపొందారు.ఏపీ అసెంబ్లీలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీలకు కూడా ప్రాతినిథ్యం ఉంది. మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. వైసీపీ తరపున 11మంది మాత్రమే సభ్యులు ఉండటంతో తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ప్రతిపక్ష హోదాకు తగినంత మంది సభ్యుల బలం లేకపోవడంతో వైసీపీ తరపున గెలిచిన వారికిి సాధారణ ఎమ్మెల్యే హోదా మాత్రమే వర్తిస్తుందని అధికార పక్షం తేల్చేసింది.
సభకు రావడానికి ఎందుకు విముఖత..
ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సభకు హాజరు కావడానికి వైసీపీ విముఖత చూపింది. దీనికి తోడు అసెంబ్లీలో అధికార పార్టీ తమపై ప్రతీకారం తీర్చుకుంటుందనే అనుమానం ఆ పార్టీ బాధ్యుల్లో ఉంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో మాట్లాడే అవకాశం ఇవ్వరని, అధికార పార్టీ అడ్డు తగులుతుందనే అనుమానం ఆ పార్టీలో ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో టీడీపీ, బీజేపీలు తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పట్లో వైసీపీకి తగినంత బలం ఉన్నా ఆ పార్టీ నుంచి 23 మంది సభ్యులు టీడీపీలో చేరారు.
2019లో వైసీపీకి ఏకపక్షంగా మెజార్టీ లభించింది. 151 స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. టీడీపీ నుంచి గెలిచిన వారిలో నలుగురు వైసీపీ పక్షం చేరిపోయారు. టీడీపీ కేవలం 23మందితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జనసేన నుంచి గెలిచిన ఒక్క సభ్యుడు కూడా అప్పట్లో వైసీపీ పక్షాన చేరిపోయాడు.
2019-24 మధ్య ఏపీ అసెంబ్లీలో వైసీపీ బలం ఏకపక్షంగా ఉండటంతో టీడీపీ మీద దూకుడుగా వ్యవహరించేవారు. వైసీపీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని టీడీపీ విమర్శించడం, న్యాయపరమైన అవరోధాలు కల్పించడం, శాసనసభలో వైసీపీ అమోదించిన బిల్లుల్ని మండలిలో బలమున్న టీడీపీ అడ్డుకోవడం సాధారణంగా జరిగేవి. ఓ దశలో ఏపీ అసెంబ్లీలో తమ బలం ఉన్నా మండలిలో మాట నెగ్గడం లేదని ఏకంగా శాసన మండలిని రద్దు చేయాలని జగన్ భావించారు. మండలితో వృధా ఖర్చు తప్ప ప్రజలకు ఉపయోగం లేదని తీర్మానం చేశారు. మండలి రద్దు నిర్ణయానికి కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
నాడు టీడీపీ నేడు వైసీపీ…
మరోవైపు ఏపీలో ఘనమైన విజయాన్ని దక్కించుకున్నా రాజకీయంగా టీడీపీ మీద పోరాటంలో వైసీపీకీ ఇబ్బందులు తప్పేవి కాదు. దీంతో విమర్శలు, ఆరోపణలు శృతి మించేవి. చివరకు 2021 నవంబర్‌లో ఏపీ అసెంబ్లీ సమావేశాలకు రానని, ముఖ్యమంత్రిగానే మళ్లీ సభలో అడుగుపెడతానని టీడీపీ అధ్యక్షుడు సభ నుంచి వాకౌట్ చేశారు. రెండున్నరేళ్ల తర్వాత 2024ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఏపీ అసెంబ్లీలో గతంలో జరిగిన పరిణామాలు పునరావృతం అవుతాయనే ఉద్దేశమో మరో కారణమేదైనా ఉందో స్పష్టంగా వెల్లడించకపోయినా శాసనసభకు రావడానికి జగన్ విముఖత చూపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి కూడా అతి కష్టమ్మీద హాజరయ్యారు. సభలో తనను టీడీపీ అవమానించేలా వ్యవహరిస్తుందనే ఆలోచనతో ఆయన వారికి ఎదురు పడటానికి కూడా ఆసక్తి చూపలేదు.
తాజాగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో బడ్జెట్ కేటాయింపులు, పథకాల అమలు తీరును నిలదీసే అవకాశాన్ని కూడా జగన్ వదులుకున్నారు. అసెంబ్లీ జరిగే సమయంలో ప్రతిరోజు మీడియా సమావేశాలను నిర్వహిస్తానని ప్రకటించారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఎటూ ఇవ్వరు కాబట్టి తమ గొంతు బయట వినిపిస్తామని ప్రకటించారు. అయితే దానిని కూడా జగన్ ఆచరణలో అమలు చేయలేదు.
సోషల్ మీడియా కేసులతో ఉక్కిరిబిక్కిరి…
అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరై ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. సభలో మాట్లాడే అవకాశం వచ్చేదా లేదా అన్నిది పక్కన పెడితే అధికారాన్ని కోల్పోయిన తర్వాత తొలిసారి సభలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని మాత్రం జగన్ జారవిడుచుకున్నారు.
అసెంబ్లీ సమావేశాలకు రాకుండా అసెంబ్లీ వెలుపల కూటమిపై విమర్శల దాడి చేయకుండా టీడీపీ పన్నిన వ్యూహంలో జగన్ శిబిరం చిక్కుకుంది. గత కొద్ది రోజులుగా పెద్ద సంఖ్యలో జరుగుతున్న సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ పార్టీ కోసం సోషల్‌మీడియాలో ప్రత్యర్థులపై దాడి చేసే ప్రధానమైన వారిని గుర్తించి కేసులు పెట్టడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. దీంతో ఏపీ అసెంబ్లీ - బడ్జెట్ అంశం పక్కదారి పట్టింది. ఓ దశలో వైసీపీ కార్యకర్తల కోసం బాధితులను పరామర్శించేందుకు జగన్ రెడీ అయినట్టు కూడా ప్రచారం జరిగినా ఆ తర్వాత జిల్లాల వారీగా ముఖ్య నాయకులకు ఆ బాధ్యతలు అప్పగించారు.
ఎవరికి లాభం, ఎవరికి నష్టం..
జగన్ అసెంబ్లీకి రాక పోవడంతో సభలో పోరాడే అవకాశాన్ని విడుచుకున్నారు. అసెంబ్లీలో పోరాడి, మైక్ ఇవ్వకపోతే అప్పడు తను సభ నుంచి వెళ్లిపోతే కనీసం పోరాడినట్టు చెప్పుకోవడానికి ఉండేది. ముందే అస్త్త్ర సన్యాసం చేశాడు. దీనికి తోడు జగన్ రాకపోవడంతో సభలో దూషణలు, బూతులు లేకుండా చర్చ జరుగుతోందని అధికార పార్టీ చెప్పుకోడానికి అవకాశం దొరికింది.
బడ్జెట్‌లో టీడీపీ కూటమి కీలక హామీల కేటాయింపుల విషయం వాస్తవానికి రచ్చ జరుగుతుంది. కానీ ఈ సారి దాని గురించి మాట్లాడలేదు. జనంలో కూడా ఎన్నికల హామీల అమలుపై పెద్దగా చర్చకు రాలేదు. దీంతో టీడీపీ కూటమి ఊపిరి తీసుకునే అవకాశం దొరికినట్టైంది.
సోషల్ మీడియా అరెస్టులు వైసీపీపై చాలా ప్రభావం చూపించాయి. చాలా మంది తమ అకౌంట్లు క్లోజ్ చేశారు. బహిరంగ క్షమాపణలు చెప్పారు. చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల సమయంలోనే సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల అంశం ఎత్తుకోకపోయినా జగన్ సభకు రాకపోవడం, అరెస్టులు ఏకకాలంలో కూటమి కలిసొచ్చాయి.
సంబంధిత కథనం