Kavali Bus Driver Issue: కావలి బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన ప్రధాన నిందితుడి అరెస్ట్
Kavali Bus Driver Issue: రాజకీయ నాయకులను అడ్డు పెట్టుకుని కావలిలో పెట్రేగిపోయిన క్రిమినల్ గ్యాంగ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం ఆర్టీసీ డ్రైవర్ మీద దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిని చెన్నైలో అరెస్ట్ చేశారు.
Kavali Bus Driver Issue: అడ్డు తప్పుకోమన్నందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి చేసిన ఘటనలో కీలక ముద్దాయిను న కావలి రూరల్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులందరిని ఇప్పటికే అరెస్ట్ చేసినా సూత్రధారి మాత్రం తప్పించుకున్నాడు.
డ్రైవర్ పై దాడి చేసిన కేసులో ఏ-1 దేవరకొండ సుధీర్ అలియాస్ అజయ్ రెడ్డిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసుల సహకారంతో ఇన్నాళ్లు అడ్డదారుల్లో అక్రమాలకు పాల్పడినా చూసి చూడనట్టు వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. నిందితుడు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో మోసాలు, దందాలు, బెదిరింపులు, దొంగ బంగారం అమ్మకాలు, పెద్ద నోట్ల మార్పిడి వంటి వ్యవహారాల్లో ఆరితేరిపోయాడు. అనుచరులతో కలిసి అమాయకులను మోసం చేయడం, బెదిరింపులతో కోట్లకు పడగలెత్తాడు.
నిందితుడిపై ఏపీలోని 10 పోలీస్ స్టేషన్‌లలో 25 కేసులు మరియు సస్పెక్ట్ షీట్ ఉన్నా ఇన్నాళ్లు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఊపేక్షించారు. కావలి ఆర్టీసీ డ్రైవర్ ఉదంతం సంచలనం సృష్టించడంతో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో నిందితుడిపై చర్యలకు ఉపక్రమించారు.
నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత అతని ఇంటిలో సోదాలు నిర్వహించారు. పోలీసుల సోదాల్లో వాకీ టాకీలు-4, మొబైల్ జామర్స్-2, లీడింగ్ చైన్, హ్యాండ్ కప్స్-4, పదునైన కత్తులు, ఎయిర్ పిస్టల్స్-4, రౌండ్స్, ఫోల్డింగ్ ఐరన్ స్టిక్స్-2, మొబైల్స్, ల్యాప్ టాప్స్, రూ.7లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
మోసాలు.. బెదిరింపులు…
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన దేవరకొండ సుధీర్ పాపాల చిట్టా తవ్వేకొద్ది బయటపడుతోంది. నేరాల కోసం ఏకంగా ప్రత్యేక డెన్ ఏర్పాటు చేసుకున్నాడు. అక్టోబర్ 26న ఆర్టీసీ డ్రైవర్‌పై అమానుషంగా దాడి తర్వాత నిందితుడి కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. ఎట్టకేలకు పోలీసులు అతడిని పట్టుకున్నారు. సుధీర్ నేరచరిత్రను జిల్లా ఎస్పీ కె.తిరుమలేశ్వరరెడ్డి వెల్లడించారు.
డ్రైవర్ రాంసింగ్‌పై దాడి విషయంలో ఏడుగురిని అప్పట్లోనే అరెస్టు చేశారు. సుధీర్‌తో పాటు పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. గురువారం కావలిలోని తుపాన్‌నగర్‌లో ఉన్న ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. నిందితుడి ఇంట్లో హంగామాను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు.
సుధీర్ ముఠా రకరకాల మోసాలతో అమాయకుల్ని మోసం చేస్తుంటుంది. పెద్దనోట్ల రద్దు సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో తన మనుషులను ఏర్పాటు చేసుకుని రూ. కోటికి రూ. 75 లక్షలు ఇస్తామని మోసాలు చేశాడు. అతని మాటలు నమ్మి ఎవరైనా నగదు పట్టుకుని వస్తే మొదట నగదు ముట్టజెప్పేవాడు.
అతని మీద నమ్మకం కుదిరి భారీ మొత్తంలో నగదు పట్టుకువస్తే వారిని మోసం చేసేవాడు. గే తక్కువ ధరకు బంగారం ఇస్తామని పలువురిని మోసం చేశాడు. కేజీ బంగారం రూ. 50 లక్షల ఖరీదు చేసే దానిని రూ. 35 లక్షలకు ఇస్తామని నమ్మిస్తుంటాడు. మొదట చెప్పినట్టే ఇస్తాడు. తర్వాత తన మనుషులతో పోలీసులు దాడి చేసినట్లు నటించి డబ్బులతో ఉడాయిస్తాడు. రూ. 2 వేల నోట్ల రద్దు సమయంలో ఇలాగే పలువురిని మోసాలు చేశాడు. నిందితుడు ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడులో కూడా పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీస అతడి బాధితులు ఉన్నారని ఎస్పీ తెలిపారు.