Vijayawada West Bypass : నరకయాతన నుంచి విముక్తి.. బెజవాడ వాసుల దశాబ్దాల కల సాకారం!-arrangements to start vijayawada western bypass road soon ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada West Bypass : నరకయాతన నుంచి విముక్తి.. బెజవాడ వాసుల దశాబ్దాల కల సాకారం!

Vijayawada West Bypass : నరకయాతన నుంచి విముక్తి.. బెజవాడ వాసుల దశాబ్దాల కల సాకారం!

Basani Shiva Kumar HT Telugu
Published Feb 07, 2025 10:54 AM IST

Vijayawada West Bypass : విజయవాడ వాసుల దశాబ్దాల కల సాకారం కాబోతోంది. ట్రాఫిక్ వల్ల ఎన్నో ఏళ్లుగా పడుతున్న నరకయాతన నుంచి విముక్తి లభించనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విజయవాడ పశ్చిమ బైపాస్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

విజయవాడ పశ్చిమ బైపాస్
విజయవాడ పశ్చిమ బైపాస్

కోల్‌కత్తా- చెన్నై ఎన్‌హెచ్ 16 జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా విజయవాడలో మరీ ఎక్కువ. ఈ పరిస్థితి చెక్ పెట్టాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా.. జాతీయ రహదారిపై రద్దీని తగ్గించడానికి బైపాస్ రోడ్డును నిర్మించాలని సంకల్పించింది. దీని ద్వారా విజయవాడ నగరంలోకి వెళ్లకుండానే హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై వెళ్లేలా నిర్మాణం చేపట్టారు.

పక్కా ప్రణాళికతో..

అమరావతికి కనెక్టివిటీ పెంచడం కోసం 20017లో అప్పటిలో ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించింది. గన్నవరం సమీపంలోని చిన్న అవుటుపల్లి నుంచి.. మంగళగిరి సమీపంలోని కాజా టోల్‌గేట్ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ప్రతిపాదించింది. 47 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మించాలని ప్లాన్ చేశారు. దీనికోసం భూసేకరణ చేసి.. ఆరు వరుసల నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ సిద్ధం చేసి.. అప్పటి కేంద్ర ప్రభుత్వానికి పంపింది.

భారత్ మాలలో చేర్చి..

కేంద్రం ఈ ప్రాజెక్టును భారత్ మాలలో చేర్చి.. నిర్మాణ బాధ్యతలను జాతీయ రహదారుల విభాగానికి అప్పగించింది. దీన్ని పలు ప్యాకేజీలుగా విభజించి నిర్మాణ పనులు చేపట్టారు. చిన్నఅవుటుపల్లి నుంచి గొల్లపూడి వరకు ప్యాకేజీ 3గా ప్రకటించి.. నిర్మాణ బాధ్యతలను మేఘా సంస్థకు అప్పగించారు. గొల్లపూడి నుంచి కాజా టోల్‍గేట్ వరకు ప్యాకేజీ 4గా విభజించి.. నవయుగ, ఆదానీ గ్రూప్ సంస్థలకు నిర్మాణ బాధ్యతలు ఇచ్చారు.

శరవేగంగా పనులు..

2021లో నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించి.. శరవేగంగా చేశాయి. చిన్నఅవుటుపల్లి నుంచి గొల్లపూడి మార్గంలో దాదాపు 95 శాతం పనులు పూర్తయ్యాయి. విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు పనులను రూ.11,048 కోట్లతో చేపట్టారు. తాజాగా నిర్మించే రోడ్డు నిర్మాణంలో ప్రమాదాలకు తావు లేకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ బైపాస్ నిర్మాణంతో.. విజయవాడ శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందున్నాయి. గతంలో విజయవాడ నుంచి నున్న వైపు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గాం లేదు. దీంతో ఆవైపు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు ఈ బైపాస్ నిర్మాణంతో.. ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి.

స్పీడ్ గన్స్.. సీసీ కెమెరాలు..

ఈ రోడ్డును అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి నిర్మించారు. 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా దీన్ని నిర్మించారు. పరిమిత వేగం దాటితే గుర్తించేలా.. స్పీడ్ గన్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అటు సోలార్ సిస్టమ్ లైటింగ్ ఏర్పాటు చేశారు. రోడ్డు మొత్తం వీటిని అమర్చారు. ఎక్కడా చీకటి ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ప్రమాదాలు జరగకుండా.. అవసరమైన ప్రతిచోటా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. స్పీడ్ తగ్గించాల్సిన ప్రాంతాల్లో ఇండికేషన్స్ పెట్టారు.

భూముల ధరలకు రెక్కలు..

పశ్చిమ బైపాస్ నిర్మాణంతో.. దీనివెంట రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు భూములు కొనుగోలు చేయడంతో.. ధరలు బాగా పెరిగాయని అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పొలాల ధరలు కూడా పెరిగాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎకరాకు రూ.2 కోట్లు ఉండగా.. ఈ రోడ్డు నిర్మాణంతో ప్రస్తుతం రూ.6 నుంచి 7 కోట్లు ఉందని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు మొత్తం పూర్తయితే.. ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

Whats_app_banner