Janasena Meeting :నేడే జనసేన ఆవిర్భావ సభ.. ర్యాలీలకు అనుమతి లేదన్న పోలీసులు-arrangements completed for janasena foundation day and krishna district police denied permission for rally ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Arrangements Completed For Janasena Foundation Day And Krishna District Police Denied Permission For Rally

Janasena Meeting :నేడే జనసేన ఆవిర్భావ సభ.. ర్యాలీలకు అనుమతి లేదన్న పోలీసులు

HT Telugu Desk HT Telugu
Mar 14, 2023 07:12 AM IST

Janasena Meeting జనసేన పదో ఆవిర్భావ సభకు మచిలీపట్నంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.మచిలీపట్నం శివార్లలో ప్రైవేట్ స్థలంలో 34ఎకరాల విస్తీర్ణంలో పార్టీ పదో ఆవిర్భావ సభకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బెజవాడ నుంచి పవన్ కళ్యాణ్ ర్యాలీగా బందరు వెళ్లాలని నిర్ణయించడంతో అందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లను వివరిస్తున్న నాదెండ్ల మనోహర్
జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లను వివరిస్తున్న నాదెండ్ల మనోహర్

Janasena Meeting జనసేన పదో ఆవిర్భావ సభ నిర్వాహణకు కృష్ణా జిల్లా మచిలీపట్నం ముస్తాబైంది. మరోవైపు జనసేన సమావేశం నేపథ్యంలో విజయవాడ ఆటోనగర్‌ నుంచి బందరు వరకు తలపెట్టిన ర్యాలీకి అనుమతిలేదని కృష్ణా జిల్లాఎస్పీ జాషువా ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

జనసేన ఆవిర్భావ సభ సందర్బంగా జాతీయ రహదారిపై ర్యాలీలు, సభలు నిర్వహించడానికి అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. 14వ తేదీ మంగళవారం మచిలీపట్నం మండల పరిధిలోని సుల్తానగర్‌లో తలపెట్టిన జనసేన పదో ఆవిర్భావ సభ సందర్భంగా విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళే జాతీయ రహదారి 65 పై ర్యాలీలు, బహిరంగ ప్రదర్శనలు నిర్వహించడానికి అనుమతి లేదన్నారు

కృష్ణాజిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని జాతీయ రహదారి మీదుగా ప్రయాణించే సామాన్య ప్రజానీకానికి, అత్యవసర సర్వీసులైన మెడికల్, ఫైర్, ఇతర వాహనాలకు ఎటువంటి అంతరాయం కలిగించరాదని సూచించారు. పోలీసు వారి అనుమతులకు విరుద్ధంగా ర్యాలీలు గాని, బహిరంగ ప్రదర్శనలు గాని నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని హెచ్చరించారు.

మరోవైపు పోలీసుల ఆంక్షల నేపథ్యంలో వారాహి ఆగదని జనసేన నాయకులు తేల్చి చెప్పారు. పోలీసులకు తమ సహకారం ఉంటుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి మొదలవుతున్నాయని, మంగళవారం సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ఉండటం వల్ల పోలీసు శాఖ విజ్ఞప్తి మేరకు వారాహి యాత్రను ముందు అనుకున్నట్లు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభించడం లేదని, శాసనసభకు వచ్చే మంత్రులు, శాసనసభ్యులు, ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వారాహి యాత్ర ప్రారంభం అయ్యే స్థలాన్ని విజయవాడ ఆటోనగర్ కు మార్చినట్లు నాదెండ్ల చెప్పారు.

మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు వారాహి వాహనంలో విజయవాడ ఆటోనగర్ నుంచి మచిలీపట్నం సభాస్థలికి బయలుదేరుతారతారని తెలిపారు. ముందుగా ఎంపిక చేసిన అయిదు ప్రాంతాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికేందుకు జన సైనికులు సిద్ధంగా ఉండాలని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తూ క్రమశిక్షణ పాటించాలని సూచించారు. వారాహి వాహనానికి ఏమాత్రం అడ్డు రాకుండా సభా స్థలికి తీసుకు వచ్చేలా ప్రణాళికతో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు.

ఆవిర్భావ సభ ఏర్పాట్లు పూర్తి….

జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. 34 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కనీవినీ ఎరుగని రీతిలో సభ స్థలి ముస్తాబు అయ్యింది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా అన్ని వసతులతో సభా ప్రాంగణం సిద్ధం చేశారు. సభ వేదికకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు. సభకు వచ్చే వాహనాలు పార్కింగ్ కోసం ప్రత్యేకంగా నియోజకవర్గాల వారీగా స్థలం కేటాయించారు.

సభకు వచ్చే వారికి తాగునీటి సదుపాయం, వైద్య సదుపాయం, మరుగుదొడ్లు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సోమవారం సాయంత్రం సభా ప్రాంగణాన్ని పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభా ప్రాంగణం మొత్తం కలియతిరిగి మొత్తం ఏర్పాట్లు గురించి కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఏ ఏర్పాట్లు జరుగుతున్నాయో స్వయంగా పరిశీలించారు.

"ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆవిర్భావ సభకు వాలంటీర్ల సేవలు చాలా కీలకమని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే జనసైనికులు, వీర మహిళలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాలంటీర్లు పనిచేయాలని నాదెండ్ల సూచించారు. నిబంధనల ప్రకారం పక్కాగా వ్యవహరించాలని సభకు వచ్చిన ప్రతి ఒక్కరినీ గౌరవించి, వారిని ప్రత్యేకంగా చూసుకోవడం వాలంటీర్ల బాధ్యత అన్నారు. పార్టీ ప్రతిష్ట పెంచేలా వాలంటీర్ల సేవలు ఉండాలన్నారు. పూర్తిస్థాయిలో సమన్వయం చేసుకొని పని చేయాలని, నిర్వహణ కమిటీ సూచనలు తీసుకోవాలని సూచించారు.

IPL_Entry_Point