AP TG Arogyasri: తెలుగు రాష్ట్రాల్లో నిలిచిన ఆరోగ్య శ్రీ ..వైద్య సేవలు అందక రోగుల విలవిల, ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ-arogya sri services in telugu states have stalled patients are suffering lack of medical services ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tg Arogyasri: తెలుగు రాష్ట్రాల్లో నిలిచిన ఆరోగ్య శ్రీ ..వైద్య సేవలు అందక రోగుల విలవిల, ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ

AP TG Arogyasri: తెలుగు రాష్ట్రాల్లో నిలిచిన ఆరోగ్య శ్రీ ..వైద్య సేవలు అందక రోగుల విలవిల, ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 20, 2025 09:53 AM IST

AP TG Arogyasri: తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. దాదాపు రెండు వారాలుగా రోగులకు ఆరోగ్య శ్రీలో ప్రైవేట్ ఆస్పత్రులు సేవలు నిలిపి వేయడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకు పోవడంతో ఆస్పత్రులు సేవలు నిలిపి వేశాయి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిలిచిన ఆరోగ్య శ్రీ సేవలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిలిచిన ఆరోగ్య శ్రీ సేవలు

AP TG Arogyasri: తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. ఏపీ, తెలంగాణల్లో ఆరోగ్య శ్రీ బకాయిలు భారీగా పేరుకుపోవలడంతో ప్రైవేట్ ఆస్పత్రులు రోగులకు సేవల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. ఏపీలో ఆరోగ్య శ్రీ సేవల్ని బీమా పరిధిలోకి తీసుకు రానున్నట్టు ప్రకటించడంపై నెట్‌ వర్క్‌ ఆస్పత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 

మరోవైపు ఏపీలో ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.3వేల కోట్లకు చేరుకున్నాయి. దీంతో బకాయిలు చెల్లించే వరకు సేవల్ని అందించ లేమంటూ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. ఇదే అదనుగా కొన్ని ఆస్పత్రులు నిస్సహాయ స్థితిలో ఉన్న రోగుల్ని పిండుకోవడం మొదలుపెట్టాయి. చికిత్సల అవసరం, బంధువుల ఆందోళనను క్యాష్ చేసుకుంటున్నాయి.

ఏపీలో గత పది రోజులుగా నెట్‌వర్క్‌ ఆస్పత్రులన్నీ అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలనూ నిలిపివేశాయి. కొన్ని చోట్ల డయాలసిస్‌ సేవల్ని కూడా సొంత ఖర్చులపై అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉన్న ఆరోగ్యశ్రీ కౌంటర్లను మూసివేశారు. అత్యవసర వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రలు అత్యవస చికిత్సలు చేసేందుకు రోగులను అందిన కాడికి పిండేస్తున్నాయి.

ఏపీలో ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.3వేల కోట్లకు చేరడంతో అందులో రూ.500 కోట్లు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా అది నెరవేరలేదు. దీంతో జనవరి 6 నుంచి ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలు నిలిపివేశారు. నెట్‌ వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయి 13 రోజులైనా ప్రభుత్వం నుంచి స్పందన మాత్రం కరువైంది.

అత్యవసర వైద్య సేవలు, గుండె జబ్బులు, జీర్ణకోశ సమస్యలు, డయాలసిస్ రోగులు ఆరోగ్య శ్రీ సేవలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆరోగ్య శ్రీ లేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులు రోగుల నుంచి వీలైనంత పిండుకుంటున్నాయి. శస్త్ర చికిత్సలు చేయడంలో రకరకాల మోసాలకు పాల్పడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అత్యవసర చికిత్సల కోసం చేరిన రోగులకు తొలుత చెప్పిన అంచనాల కంటే తర్వాత రెట్టింపు చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు.

యథేచ్ఛగా ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ

విజయవాడలో గాల్‌ బ్లాడర్‌లో స్టోన్స్‌ తొలగించేందుకు శస్త్ర చికిత్స చేయించుకున్న వ్యక్తి నుంచి, శస్త్ర చికిత్స జరుగుతుండగా ముందుగా గుర్తించనివి కూడా ఉన్నాయని, వాటి కోసం మరో సర్జరీ చేయాలంటూ ఓ ఆస్పత్రిలో రెట్టింపు వసూలు చేశారు. వైద్య పరీక్షలకు రూ.25వేలు, శస్త్ర చికిత్సకు రూ.70వేలు ఖర్చవుతుందని చెప్పిన వైద్యులు తర్వాత మరో రూ.75వేలు అదనంగా వసూలు చేసినట్టు బాధితులు హిందుస్తాన్‌ టైమ్స్‌ కు వివరించారు. ఆరోగ్య శ్రీ సేవల కోసం ఎన్ని ఆస్పత్రులకు వెళ్లినా లేదని తిరస్కరించినట్టు బాధితుడు పున్నారావు వివరించారు. ఆస్పత్రుల తీరుపై ఫిర్యాదు చేసే యంత్రాంగం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.

తెలంగాణలోను అంతే…

తెలంగాణ ఆరోగ్య శ్రీ బకాయిల్ని చెల్లించే విషయంలో జరుగుతున్న తాత్సారంతో వైద్య సేవల్ని ఆస్పత్రుల్లో నిలిపివేశాయి. గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందించే వారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య సేవల పరిమితి రూ.10 లక్షలకు పెంచినా ఆస్పత్రుల్లో సేవలు మాత్రం నిలిచిపోయాయి. సంక్రాంతికి ముందు నుంచే పెండింగ్ బకాయిల విడుదల కోసం ఆస్పత్రులు ప్రభుత్వంపై ఒత్తిడి చేసినా ఫలితం లేకపోయింది.

ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచి పోవడంతో రోగులు డబ్బులు చెల్లించి వైద్య చికిత్సలు పొందుతున్నారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ కింద రాష్ట్ర వ్యాప్తంగా 1042 ప్రభుత్వ ఆస్పత్రులు, 368 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. హైదరాబాద్‌ పరిధిలో 18-20 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు కూడా ఆరోగ్యశ్రీలో వైద్యసేవలు అందిస్తున్నాయి. ఆస్పత్రులు అందించిన చికిత్సలకు రూ.1000 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరోగ్య శ్రీ బిల్లుల్ని పెండింగ్‌లో ఉంచినట్టు ఆస్పత్రులు ఆరోపిస్తున్నాయి.

బకాయిల కోసం తెలంగాణ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ జనవరి మొదటివారంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవోకు లేఖ రాసింది. 10వ తేదీలోగా పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేయకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని పేర్కొంది. దాంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో ఆరోగ్యశ్రీ ట్రస్టు చర్చలు జరిపి రూ.120 కోట్ల వరకు పెండింగ్‌ బకాయిలను చెల్లించింది. అయితే ఏడాది కాలంగా ఉన్న పెండింగ్‌ బకాయిల్లో కేవలం 45 రోజులకు సంబంధించినవే చెల్లించారని, మిగిలిన వాటిని కూడా ఈ నెలాఖరులోగా చెల్లించాలని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు డిమాండ్‌ చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో అదే రోజు నుంచి సేవలను నిలిపివేశాయి.

రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. నెట్‌వర్క్‌ ఆస్పత్రులు అద్దెలు చెల్లించే పరిస్థితి కూడా లేదని, వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదని, ఔషధాలు, సర్జికల్స్‌ సరఫరాదారులు సైతం వాటి సరఫరా నిలిపివేశారని ప్రకటనలో పేర్కొన్ానరు. పెండింగ్‌ బకాయులను వెంటనే చెల్లించాలని, ప్రతినెలా ఆరోగ్యశ్రీ బిల్లులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

బీఆర్‌ఎస్‌దే ఈ పాపమంటున్న కాంగ్రెస్‌…

ప్రభుత్వ తీరును బీఆర్‌ఎస్‌ తీవ్రంగా తప్పు పట్టింది. మరోవైపు గత పదేళ్లలో ఆరోగ్యశ్రీని నీరుగార్చిన వారే ఇప్పుడు ఆ పథకం గురించి మాట్లాడుతున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.బీఆర్‌ఎస్‌ హయాంలో ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదని, ప్యాకేజీల ధరలను రివైజ్‌ చేయలేదని తెలిపారు. సుమారు రూ.730 కోట్లు బాకీ పెట్టి పోయారని విమర్శించారు. ఏడాది కాలం లో పాత బకాయిలు సహా రూ.1130 కోట్లు చెల్లించామని, ప్రతి నెలా బిల్లులు చెల్లిస్తున్నామని వివరించారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులు లేవనెత్తిన ఇతర సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం