AP Cabinet Expansion: ఏపీ క్యాబినెట్‌లో మార్పులు చేర్పులు తప్పవా..! మంత్రి వర్గం మార్పులపై జోరుగా ఊహాగానాలు-are there any changes or additions to the ap cabinet ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cabinet Expansion: ఏపీ క్యాబినెట్‌లో మార్పులు చేర్పులు తప్పవా..! మంత్రి వర్గం మార్పులపై జోరుగా ఊహాగానాలు

AP Cabinet Expansion: ఏపీ క్యాబినెట్‌లో మార్పులు చేర్పులు తప్పవా..! మంత్రి వర్గం మార్పులపై జోరుగా ఊహాగానాలు

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 28, 2024 11:50 AM IST

AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆర్నెల్లు పూర్తవగానే మంత్రి వర్గ విస్తరణ పుకార్లు మొదలయ్యాయి.మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారంతో పాటు కొందరికి ఉద్వాసన,కొత్తవారికి అవకాశం కల్పిస్తారనే ప్రచారాలు మొదలయ్యాయి.జనసేన తరపున నాగబాబుకు చోటు కల్పించనున్నారు.

ఏపీ క్యాబినెట్‌లో మార్పులు చేర్పులపై జోరుగా ఊహాగానాలు
ఏపీ క్యాబినెట్‌లో మార్పులు చేర్పులపై జోరుగా ఊహాగానాలు

AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు తప్పవని జోరుగా ప్రచారం జరుగుతోంది. క్యాబినెట్‌ మంత్రుల్లో పలువురి పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.  మంత్రి వర్గంలో యువరక్తానికి అవకాశం కల్పించే ఉద్దేశంతో సామాజిక సమీకరణల్లో భాగంగా తొలిసారి గెలిచిన వారికి కూడా మంత్రులుగా అవకాశం లభించింది. అయితే  ఇలా క్యాబినెట్‌ మంత్రులైపోయిన వారిలో కొంతమందికి ఉద్వాసన తప్పదని, అసంతృప్తుల్ని చల్లార్చే ప్రయత్నంలో భాగంగా  సీనియర్లకు చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. 

yearly horoscope entry point

రాజ్యసభ స్థానాల భర్తీ సందర్భంగా జనసేన తరపున నాగబాబు పేరు తెరపైకి వచ్చింది. అయితే అనూహ్యంగా ఖాళీ అయిన మూడు స్థానాల్లో ఒకదానిని బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. దీంతో మిగిలిన రెండు టీడీపీకే దక్కాయి. దీంతో  జనసేన నుంచి నాగబాబును రాష్ట్ర మంత్రి వర్గంలోకి  తీసుకోవాలనే ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. 

నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించినా ఎప్పడనేది మాత్రం స్ఫష్టత లేదు. మంత్రి వర్గంలో తీసుకున్న తర్వాత ఆరునెలల్లో ఎప్పుడైనా శాసనమండలికి పంపే అవకాశం ఉంటుంది. దీంతో  ఏపీ క్యాబినెట్‌ విస్తరణ ఎప్పుడనే అంశం ఆసక్తికరంగా మారింది. నాగబాబుతో పాటు మంత్రి వర్గ ప్రక్షాళన, పునర్వ్యస్థీకరణ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో టీడీపీ వర్గాల్లో జరిగే ఊహాగానాలే ఎక్కువగా ఉన్నాయి. గతానుభవాల దృష్ట్యా మంత్రి వర్గం నుంచి తొలగించే ముందు వారి పేర్లకు విస్తృత ప్రాచుర్యం కల్పించే ఆనవాయితీ టీడీపీలో ఉంది.  ఫలానా మంత్రిపై ఆరోపణలు వస్తున్నాయని ముందే లీకులిచ్చి తర్వాత వారిపై వేటు వేస్తారనే ప్రచారం  కూడా ఉంది. క్యాబినెట్‌లో నాగబాబు మాత్రమే అవకాశం దక్కుతుందా   మరికొందరికి కూడా అవకాశం ఉంటుందా అనేది చర్చగా మారింది. 

ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పేర్లు ఇవే..

ఏపీ క్యాబినెట్‌లో కొందరు మంత్రులపై వేటు పడుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్ధసారధి వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణల్లో భాగంగా వీరికి మంత్రి పదవులు దక్కినా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారిపై వస్తున్న ఫిర్యాదులు, పార్టీలోని వారి ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లతో  అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. 

కార్మిక శాఖ మంత్రిగా ఉన్న  వాసంశెట్టి సుభాష్‌ పనితీరును ముఖ్యమంత్రి  తప్పు పెట్టారు. చిన్న వయసులో మంత్రిగా అవకాశం ఇచ్చినా  పార్టీ బాద్యతలు వదిలేశారని, ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదులో నిర్లక్ష్యం వహించారని సీఎం చంద్రబాబు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత సంభాషణల్లో సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని టీడీపీ నేతలే వైరల్ చేశారు.  తాజాగా సుభాష్‌ను తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

సామాజిక సమీకరణా నేపథ్యంలో సుభాష్ ను మంత్రి వర్గం నుంచి తప్పించే అవకాశాలు లేకున్నా ముఖ్యమంత్రి మదిలో ఏముందో అంతు చిక్కడం లేదు. సుభాష్‌కు కట్టడి చేసే క్రమంలో ఈ రకమైన ప్రచారం తెరపైకి వచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి.  ఉమ్మడి గోదావరి జిల్లాల్లో శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి సుభాష్ మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి పితాని సత్యనారాయణ  ఎమ్మెల్యేగా ఉన్నా.. తొలిసారి గెలిచిన  సుభాష్‌కు మంత్రిగా  అవకాశం దక్కింది. ఇప్పుడు సుభాష్ ను తప్పించడానికి  ఇతర కారణాలు కన్పించడం లేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీలో  చాలా మంది సీనియర్ నేతలు ఉండడం.. వారికి కాకుండా సుభాష్ కు మంత్రి పదవి ఇవ్వడం ఆ జిల్లాలో ఎవ్వరికీ రుచించలేదు. 

దీంతో మంత్రి వర్గ విస్తరణ జరిగితే తే సుభాష్‌ను తప్పిస్తారని ఆ పార్టీ నేతలు చేస్తున్నారు.  సుభాష్ ను తప్పిస్తే అదే సామాజిక వర్గానికి చెందిన పితానికి ఛాన్స్ దక్కుతుంది. ఇది ఎంతవరకు సాధ్యమనే సందేహాలు కూడా టీడీపీలో ఉన్నాయి.

వివాదాస్పద మంత్రికి ఎసరు…

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే  మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరుపై  విస్తృతంగా  ప్రచారం జరిగింది. మంత్రి సతీమణి పోలీసులపై దురుసు ప్రవర్తనతో ఆయన వార్తల్లోకి ఎక్కారు. ఆ తర్వాత ఆయన వ్యవహార శైలితో  రాం ప్రసాద్ రెడ్డిని పదవి నుంచి  తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. 

రవాణ శాఖ మంత్రిగా ఉన్న రాం ప్రసాద్ రెడ్డి వ్యవహారశైలిపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ కన్నేసిందని.. నివేదికలు సీఎంఓను చేరినట్టు ప్రచారం జరుగుతోంది. రాం ప్రసాద్ రెడ్డిని తప్పిస్తే  రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతతో భర్తీ చేయాల్సి ఉంటుంది. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా  అదే జిల్లా నుంచి ఆనం మంత్రిగా ఉండటంతో సోమిరెడ్డికి ఎంత వరకు అవకాశం ఉంటుందనేది డౌట్.

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరు కూడా  తెరపైకి వచ్చింది. క్యాబినె‌ట్‌లో కిషోర్ కుమార్ రెడ్డి పేరు ఉంటుందని అంతా భావించారు. కానీ కిషోర్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కలేదు. 

బొత్స కాళ్లకు మొక్కరా?

క్యాబినెట్‌ నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్న వారిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేరు కూడా ఉంది. విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ నాయకుడు  బొత్స కాళ్లకు మొక్కి.. ఆశీర్వాదం తీసుకున్నారని ప్రచారం జరిగింది.  అప్పటి నుంచి కొండపల్లిపై వేటు అంటూ  చర్చ మొదలైంది. కొండపల్లి మర్యాదపూర్వకంగా మాత్రమే బొత్సతో ఎయిర్‌పోర్ట‌ లాంజ్‌లో మాట్లాడారని ఆయన వర్గం చెబుతోంది. 

తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావుకు కాకుండా కొండపల్లికి మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే  బొత్స కాళ్లకు మొక్కడం ఏమిటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొండపల్లిని తప్పించాల్సి వస్తే.. కళా వెంకట్రావుకే మంత్రి పదవి దక్కుతుందని చెబుతున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో బొత్సను  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఆలింగనం చేసుకోవడాన్ని గుర్తు చేస్తున్నారు. 

సారథికి ఉంటుందా ఊడుతుందా…

గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఎపిసోడ్‌లో కృష్ణాజిల్లా మంత్రి పార్థసారథి మంత్రి పదవికి ముడినట్టేనని చర్చ జరిగింది. వైసీపీ నేత జోగి రమేష్‌తో కలిసి వేదిక పంచుకోవడంతో టీడపీ నేతలు కొనకళ్ల, గౌతుశిరీష, కొలుసు పార్థసారథి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇంత జరిగినా పార్థసారథి మెడపై కత్తి వేలాడుతుందని మంత్రి పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. వివాదం సద్దుమణిగినట్టేనని భావిస్తున్న తరుణంలో మంత్రి వర్గ విస్తరణ తెరపైకి రావడంతో ఉత్కంఠ నెలకొంది.  ఈ విషయంలో పార్టీ క్యాడర్‌కు ఇప్పటికే సారథి క్షమాపణలు చెప్పారు. 

అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే మంత్రులపై వేటు వేయాల్సి వస్తే అది కూడా బీసీ వర్గాలకు చెందిన వారిని పదవుల నుంచి తప్పిస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే ప్రచారం కూడా ఉంది.  క్యాబినెట్‌లో ఒక్కరికి మాత్రమే ప్రస్తుతం అవకాశం ఉంది. దానిని నాగబాబుతో సరిపెడతారా  కొన్ని శాఖల్లో మార్పులు చేస్తారా అనేది కూడా సందేహంగా మారింది. ఆర్నెల్లలోనే మంత్రుల పనితీరు కొలమానం నిర్దేశించి పదవుల్ని తప్పించడం ఏమిటనే ప్రశ్నలు కూ లేకపోలేదు. కొన్ని శాఖల్లో అధికారులదే పెత్తనం సాగుతోందని మంత్రుల పనితీరుకు కొలమానం ఏమిటనే చర్చ కూడా ఏపీ పొలిటికల్ వర్గాల్లో ఉంది. 

Whats_app_banner