AP Steel Plant Investment : ఏపీలో రూ.1.4 లక్షల కోట్ల భారీ పెట్టుబడి, అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్!
AP Steel Plant Investment : ఏపీలో భారీ పెట్టుబడికి ఉక్కు దిగ్గజాలు ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ముందుకొచ్చాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడితో 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో భారీ స్టీల్ ప్లాంట్ నిర్మించనున్నాయి.
AP Steel Plant Investment : ఏపీలో భారీ పెట్టుబడికి రంగం సిద్ధమైంది. ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పాన్ స్టీల్ జాయింట్ వెంచర్ ఏఎమ్/ఎన్ఎస్ ఇండియా ఏపీలోని అనకాపల్లి జిల్లాలో రూ. 1.4 లక్షల కోట్ల పెట్టుబడితో 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్‌ను స్థాపించడానికి రెడీ అయ్యాయి. పెట్టుబడుల వేటలో కూటమి సర్కార్, మంత్రి నారా లోకేశ్ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఏపీ పెట్టుబడులకు స్వర్గధామమని పదే పదే చెబుతున్న సీఎం చంద్రబాబు... ఆ దిశగా కంపెనీలను ఆకర్షించే పనిపడ్డారు. ఇటీవల అమెరికా పర్యటించిన ఐటీ మంత్రి నారా లోకేశ్...ప్రపంచంలోనే టాప్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యి పెట్టుబడులను ఆహ్వానించారు.
రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడి
ఏపీ కూటమి సర్కార్ ప్రయత్నాలు ఫలించి పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోనే అతి పెద్ద పెట్టుబడి రూ.లక్షా 40 వేల కోట్ల ప్రాజెక్టు ఏపీకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పాన్ స్టీల్ జాయింట్ వెంచర్ AM/NS ఇండియా అనకాపల్లిలో భారీ స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది. అనకాపల్లి జిల్లాలో రూ.1.4 లక్షల కోట్లతో 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ భావిస్తున్నాయి.
మంత్రి నారా లోకేశ్, ఆర్సెలార్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్ జూమ్ కాల్ మీటింగ్ లో స్టీల్ ప్రాజెక్ట్ పై చర్చించారు. ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఏపీలోని నక్కపల్లిలో రూ.1.4 లక్షల కోట్లతో స్టీల్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసేందుకు వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఉక్కు దిగ్గజాల అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ పెట్టుబడులలో ఇది ఒకటి. ఈ ప్లాంట్ గుజరాత్‌లోని హజీరా ప్లాంట్ కంటే పెద్దదిగా తెలుస్తోంది.
రెండు దశల్లో పెట్టుబడి
ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో రూ.80 వేల కోట్ల పెట్టుబడితో ఏడాదికి 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో బ్లాస్ట్ ఫర్నేస్ స్టీల్ ప్లాంట్‌ను నక్కపల్లిలో ఏర్పాటు చేస్తారు. తొలి దశ కోసం ఈ కంపెనీ 2,600 ఎకరాల భూమిని కోరినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండో దశలో రూ. 60 వేల కోట్ల పెట్టుబడితో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు ఉత్పత్తిని పెంచనున్నారు. ఇందులో అదనంగా 2,000 ఎకరాల భూమిని ఈ సంస్థ కోరుతుంది. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ పక్కన దాదాపు 1,800 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఈ భూమిని పరిశీలించాలని ప్రభుత్వ వర్గాలు కంపెనీ ప్రతినిధులకు సూచించినట్లు సమాచారం.
85 వేల మందికి ఉపాధి
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు ర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్రతినిధులు ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు కొలిక్కి వస్తే 2029 నాటికి స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభించడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం ముందుగా ఉత్పత్తి మొదలుపెట్టాలని కోరుతుంది. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా 25 వేల మందికి, పరోక్షంగా 60 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఒడిశా, ఛత్తీస్‌గడ్ నుంచి ముడి ఖనిజాన్ని పైపు లైన్ల ద్వారా ఇక్కడకు తీసుకొచ్చి స్టీల్ ఉత్పత్తి చేసే అవకాశముందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.
సంబంధిత కథనం