Aqua Farmers crop Holiday : క్రాప్ హాలీడే బాటలో అక్వారైతులు
కోనసీమ రైతుల బాటలోనే ఆంధ్రప్రదేశ్ అక్వారైతులు కూడా క్రాప్ హాలీడే బాట పడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆగష్టు ఒకటి నుంచి క్రాప్ హాలీడే పాటించాలని భావిస్తున్నారు. అక్వా రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే క్రాప్ హాలీడే అమలు చేయడం తప్ప మరో మార్గం లేదని చెబుతున్నారు.
అక్వా రైతుల సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వంతో పాటు, ఫీడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వైఖరికి నిరసగా రైతులు క్రాప్ హాలీడే పాటించాలని యోచిస్తున్నారు. ఇటీవల కోనసీమ రైతులు కనీస మద్దతు ధర, ధాన్యం కొనుగోలు డబ్బుల చెల్లింపు, డ్రెయిన్ సమస్యలపై క్రాప్ హాలీడే పాటించాలని నిర్ణయించిన నేపథ్యంలో అక్వా రైతాంగం కూడా అదే బాట పడుతోంది. క్రాప్ హాలీడేకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సీడింగ్ యూనిట్లు ఉత్పత్తి తగ్గించుకోవాలని అక్వా రైతు సంఘాలు సూచిస్తున్నాయి. ఆగష్టు ఒకటి నుంచి రైతులు ఆందోళన బాట పడితే అక్వా విత్తనాలను కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయని సూచిస్తున్నారు. భీమవరంలో జరిగిన అక్వా రైతుల సమావేశంలో 1500మందికి పైగా రైతులు పాల్గొన్నారు. అక్వా సాగును కాపాడుకోవడానికి ఉద్యమించడం తప్ప మరో మార్గం లేదని రైతులు భావిస్తున్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేసుకుని కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
గత కొన్నేళ్లుగా అక్వా సాగులో ఎదురవుతున్న నష్టాలను భరించే స్థితిలో రైతులు లేరని, అక్వా ఉత్పత్తుల ధరలు నిర్ణయించడంలో ప్రభుత్వ అలసత్వంతో పాటు విద్యుత్ బిల్లులు, దాణా ఖర్చులు భారీగా పెరగడంతో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వాలకు తాము వ్యతిరేకం కాదని, అక్వా రంగంపై ఆధారపడిన పరిశ్రమలు కూడా రైతుల్ని నష్టపోయేలా చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగును నిలిపివేయడం తప్ప రైతులకు మరో మార్గం లేదని చెబుతున్నారు. విద్యుత్ సబ్సిడీలు దక్కడంలో రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అక్వా జోన్, నాన్ అక్వా జోన్‌లుగా ప్రభుత్వం విభజించడంతో అయా జోన్లలో ఉన్న వారికి మాత్రమే సబ్సిడీలు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. గతంలో రైతులందరికి సబ్సిడీలు వచ్చేవని, ఇప్పుడు అక్వా జోన్‌లో ఉన్న వారికి మాత్రమే ఇవ్వడం వల్ల మిగిలిన వారు నష్టపోతున్నారని చెప్పారు. ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ తప్పుడు నివేదికల వల్ల రైతులు నష్టపోతున్నారని అక్వా రైతులు ఆరోపిస్తున్నారు.
సాగుకు సబ్సిడీలు కొనసాగించడం, ఫీడ్ ధరలు గణనీయంగా పెరగడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 15రోజులకోసారి ఫీడ్ ధరల్ని పెంచేస్తుండటం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు.100కౌంట్ ఉన్న రొయ్యల ధరలు రూ.250-260 నుంచి రూ.220కు పడిపోయాయని, అదే సమయంలో ఫీడ్ ధర మాత్రం కిలోకు రూ.20 పెరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. అక్వా ఉత్పత్తులపై ఆధారపడిన కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ ముందుకు రాకపోతే అక్వా సాగును నిలిపివేయడమే మార్గమని రైతులు చెబుతున్నారు.
టాపిక్