APSRTC Sankranti Special Buses : సంక్రాంతికి ఊరెళ్లే వారికి APSRTC గుడ్‌న్యూస్ - హైదరాబాద్ నుంచి 2,400 ప్రత్యేక బస్సులు
APSRTC Sankranti Special Buses 2025 : సంక్రాంతి వేళ సొంత ఊళ్లకు వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపనుంది. రెగ్యులర్‌గా నడిచే సర్వీసులతో పాటు 2400 బస్సులను అదనంగా ఏర్పాటు చేయనుంది.
మరికొద్దిరోజుల్లోనే సంక్రాంతి సందడి మొదలుకాబోతుంది. దీంతో చాలా మంది తమ సొంత ఊర్లలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. ఇందుకోసం ఇప్పట్నుంచే ఏర్పాట్లలో ఉంటారు. అయితే హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
2400 స్పెషల్ బస్సులు….
సంక్రాంతి పండగ వేళ ఉండే రద్దీ దృష్ట్యా… హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసులను నడపనుంది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని వేర్వురు ప్రాంతాలకు వెళ్లే వారి కోసం 2,400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది.
ఈ ప్రత్యేక బస్సులు జనవరి 9వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని ఏపీఎస్ఆర్టీసీ పేర్కొంది. జనవరి 13వ తేదీ వరుక సేవలు అందిస్తాయని తెలిపింది. రెగ్యులర్‌గా నడిచే సర్వీసులతో పాటు 2400 బస్సులను అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండని క్లారిటీ ఇచ్చింది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఏపీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ నుంచి లేదా టికెట్ బుకింగ్ ఏజెంట్ల నుంచి ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ఎంజీబీఎస్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా… కొన్ని మార్పులు చేసినట్లు ప్రకటించింది. జనవరి 10 - 12 మధ్య కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే రెగ్యూలర్, ప్రత్యేక బస్సులను గౌలిగూడ సీబీఎస్ నుంచి ఆపరేట్ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరింది.
ఏపీ తెలంగాణ ప్రయాణికులకు అప్డేట్ - 20 రైళ్లు పొడిగింపు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. పలు రూట్లలో నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించింది. జనవరి 1 నుంచి మార్చి నెల వరకు రాకపోకలు ఉంటాయని పేర్కొంది.
మొత్తం 20 రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇందులో చాలా రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించేవి ఉన్నాయి. వచ్చే జనవరిలోనే సంక్రాంతి పండగ ఉంది. దేశవ్యాప్తంగానూ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి సెలవులు ఉండటంతో… చాలా మంది సొంత ఊర్లకు ప్రయాణమవుతుంటారు. వీటన్నింటి దృష్ట్యా… ఈ రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తాజా ప్రకటనలో వెల్లడించింది.
ఇక మరోవైపు ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్టు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకులు కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సెలవులు తగ్గించే యోచన లేదని స్పష్టం చేశారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ఉంటాయని తాజాగా ఆయన స్పష్టం చేశారు.
పిల్లలకు సంక్రాంతి సెలవులపై క్లారిటీ రావటంతో చాలా మంది తల్లిదండ్రులు ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. ముందస్తుగా టికెట్ల బుకింగ్ తో పాటు తదితర ఏర్పాట్లు చేసేకునే పనిలో ఉంటున్నారు.
సంబంధిత కథనం