APSRTC : గుంటూరు నుంచి కుంభ‌మేళా, అరుణాచ‌లానికి స్పెష‌ల్ స‌ర్వీసులు.. ప్యాకేజీ వివరాలు ఇవే-apsrtc special services from guntur to kumbh mela and arunachalam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc : గుంటూరు నుంచి కుంభ‌మేళా, అరుణాచ‌లానికి స్పెష‌ల్ స‌ర్వీసులు.. ప్యాకేజీ వివరాలు ఇవే

APSRTC : గుంటూరు నుంచి కుంభ‌మేళా, అరుణాచ‌లానికి స్పెష‌ల్ స‌ర్వీసులు.. ప్యాకేజీ వివరాలు ఇవే

HT Telugu Desk HT Telugu
Published Feb 10, 2025 12:24 PM IST

APSRTC : భ‌క్తుల‌కు, యాత్రికుల‌కు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. గుంటూరు నుంచి మ‌హా కుంభ‌మేళా, తమిళనాడులోని అరుణాచ‌లానికి స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ స‌ర్వీస్‌లను వినియోగించుకోవాల‌ని ఆర్టీసీ కోరుతోంది. ఈ ప్రత్యేక సర్వీసుల ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు నుంచి స్పెష‌ల్ స‌ర్వీసులు
గుంటూరు నుంచి స్పెష‌ల్ స‌ర్వీసులు

ప్రయాణికుల, భక్తుల కోరిక మేరకు గుంటూరు నుంచి మహా కుంభమేళా (ప్రయాగరాజ్)కు ఫిబ్రవరి 11న స్పెషల్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 15న మరో స్పెషల్ హైటెక్ (2+2) పుష్ బ్యాక్ సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బస్సు స‌ర్వీసులు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటలకు గుంటూరులో బయలుదేరుతాయి. ఈ యాత్ర మొత్తం 8 రోజులు పాటు సాగుతుంది.

మొత్తం 8 రోజులు..

మొదటి రోజు బస్సు గుంటూరు లో 10 గంటలకు బయలుదేరి.. రెండో రోజు సాయంత్రానికి ప్రయాగరాజ్ చేరుకుంటుంది. మూడో రోజు ప్రయాగరాజ్‌లో బస చేసి, పుణ్య స్నానాలు ఆచరించి, నాలుగో రోజు రాత్రికి అయోధ్యరే బయలుదేరుతుంది. ఐదో రోజు ఉదయం అయోధ్య చేరుకొని, బాలరాముని దర్శించుకుని, అదే రోజు సాయంత్రం వారణాసికి బయలుదేరుతుంది. ఆరో రోజు ఉదయం వారణాసి చేరుకొని, ఆ రోజు వారణాసిలో బస చేసి ఏడో రోజు ఉదయం వారణాసి నుండి గుంటూరుకు బ‌స్సులు బ‌య‌లుదేరుతాయి. ఎనిమిదో రోజు రాత్రికి గుంటూరు చేరుకుంటాయి.

బుకింగ్ ఇలా..

టిక్కెట్టును ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవ‌చ్చు. లేదంటే డిపో వ‌ద్ద‌కు వెళ్లి అయినా బుక్ చేసుకోవ‌చ్చు. ఈ సదావకాశాన్ని ప్రయాణికులు ఉపయోగించుకోవాల‌ని గుంటూరు-2 డిపో మేనేజ‌ర్ షేక్ అబ్దుల్ స‌లామ్ కోరారు. 10 కిలోమీటర్లు లోపు 35 మంది ప్రయాణికులు ఒకే చోటు నుండి బయలుదేరితే.. బస్సు అక్కడికి పంపుతారు. ఒక్కో టికెట్ ధర రూ. 8,300 గా నిర్ణ‌యించారు. ఇతర ఖర్చులు భోజనం, వసతి ఖర్చులు ప్రయాణికులే భరించాలి. మరిన్ని వివరరాల‌కు 7382897459, 7382896403 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు.

అరుణాచలం ప్యాకేజీ..

అరుణాచలంలో ఫిబ్రవరి 12న పౌర్ణమి సందర్భంగా జరిగే గిరి ప్రదక్షణ మహోత్సవాలకు.. గుంటూరు- 2 డిపో నుండి స్పెషల్ హైటెక్ (2+2) పుష్ బ్యాక్ బస్ ఏర్పాటు చేశారు. ఈ బస్ ఫిబ్రవరి 10న రాత్రి 9:15 గంటలకు గుంటూరులో బయలుదేరుతుంది. ఫిబ్రవరి 11న శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్‌ను దర్శించుకొని.. రాత్రి అక్కడ నుండి బయలుదేరుతుంది. పౌర్ణమి రోజు ఫిబ్రవరి 12న‌ ఉదయం అరుణాచలం చేరుకుంటుంది. అదే రోజు అరుణాచలేశ్వరుని దర్శించుకొని.. సాయంత్రం అరుణాచలం నుంచి గుంటూరుకు బస్సులు బ‌య‌లుదేరుతాయి.

ఫిబ్రవరి 13 ఉదయం 6:30 గంటలకు గుంటూరుకు బ‌స్సు చేరుకుంటుంది. టిక్కెట్టును ఆన్‌లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవాలి. లేదంటే డిపో వ‌ద్ద‌నైనా టిక్కెట్టును బుక్ చేసుకోవ‌చ్చు. ఒక్కో టికెట్ ధర రూ.2,420గా నిర్ణ‌యించారు. అదనపు సమాచారం కోసం 7382897459, 7382896403 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు. భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాల‌ని డిపో మేనేజ‌ర్ షేక్ అబ్దుల్ స‌లామ్ విజ్ఞప్తి చేశారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner