APSRTC : భక్తులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. భీమవరం నుంచి సప్త శ్రీనివాస దర్శనానికి ప్రత్యేక బస్సులు.. ప్యాకేజీ ఇదే
APSRTC : పుణ్యక్షేత్రాల యాత్ర చేసే భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సప్త శ్రీనివాస దర్శనం పేరుతో పుణ్యక్షేత్రాలకు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. భీమవరం నుంచి రాష్ట్రంలోని ఏడు శ్రీనివాస ఆలయాల దర్శనానికి అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు సర్వీస్‌లు వేసింది.
ఏపీఎస్ ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బట్టి, ప్రయాణికులు, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతితక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమాన్విత క్షేత్రాలైన.. సప్త శ్రీనివాసలను దర్శించుకునేందుకు బస్సు సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చింది.
ఒకే రోజులో..
ధనుర్మాసంలో సప్త శ్రీనివాస దర్శనం పేరుతో ప్రతి శనివారం ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి శనివారాల్లో ఉదయం ఐదు గంటలకు బస్సులు భీమవరం ఆర్టీసీ డీపో నుంచి బయలుదేరుతాయి. ఒకే రోజులో ఏడు ఆలయాలను దర్శించుకునే భాగ్యం కలుగుతోంది. దర్శనం అనంతరం అదే రోజు రాత్రి 8 గంటలకు భీమవరం ఆర్టీసీ డిపోకు చేరుకుంటారు.
సప్త శ్రీనివాస దర్శనం..
భీమవరంలో బయలుదేరిన బస్సులు తొలిత అప్పనపల్లి చేరుకుని అక్కడ శ్రీనివాసుని దర్శనం అనంతరం అబ్బిరాజుపాలెం బయలు దేరుతోంది. అక్కడ దర్శనం చేసుకుని కొడమంచిలి, అన్నవరప్పాడు, వాడపల్లి, ద్వారకా తిరుమల, పారిజాత గిరి దర్శనం అనంతరం తిరిగి భీమవరం చేరుకుంటారు.
ప్యాకేజీ..
టిక్కెట్టు ధర అల్ట్రా డీలక్స్ సర్వీసుకు ఒక్కొక్కరికి రూ. 500, ఎక్స్‌ప్రెస్ సర్వీసుకు ఒక్కొక్కరికి రూ. 400, పల్లెవెలుగు సర్వీస్‌కు ఒక్కొక్కరికి రూ.350 ఉంటుంది.
ఇలా పొందాలి..
టిక్కెట్లను ఆన్‌లైన్‌లో https://www.apsrtconline.in/oprs-web/services/packagetours.do లింక్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేకపోతే భీమవరం బస్‌స్టేషన్‌లో పొందవచ్చు. ఇతర వివరాల కోసం 738292475 ఫోన్ నెంబర్‌ను సంప్రదించాలని భీమవరం డిపో మేనేజర్ పీ.ఎన్.వి.ఎం సత్యనారాయణ మూర్తి తెలిపారు. రిజర్వేషన్ కోసం 9666089036, 6303810678 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని భక్తులు, యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)