APSRTC Special Buses 2025 : ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ - అనంతపురం నుంచి 266 బస్సు సర్వీసులు, 10 శాతం డిస్కౌంట్ కూడా
APSRTC Sankranti Special Buses 2025 : సంక్రాంతి వేళ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను తీసుకువస్తోంది. ఇందులో భాగంగా… అనంతపుర నుంచి 266 స్పెషల్ సర్వీసులను నడపనుంది. అయితే రాను, పోనూ ఒకేసారి రిజర్వేషన్ చేసుకుంటే టికెట్ పై పది శాతం రాయితీని కూడా ఇవ్వనున్నారు.
సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతికి 10 శాతం రాయితీతో స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. అనంతపురం నుంచి 266 స్పెషల్ బస్సు సర్వీసులను నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది.
సంక్రాంతి పండగను ఆంధ్రప్రదేశ్‌లో బ్రహ్మాండగా జరుపుకుంటారు. కనుక ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు, ఉపాధి పనులు, చదువు నిమిత్తం ఉన్నవారు సంక్రాంతికి తమ సొంతూర్లకు వస్తారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉపాధి పనులు, ఉద్యోగాలు, చదువుకున్న విద్యార్థులు కూడా గ్రామాలకు వస్తారు. అలాగే పండగ ముగించుకుని తిరిగి సొంతూర్ల నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్తారు. కనుక సంక్రాంతి సీజన్‌లో బస్సులు, రైళ్లు ఖాళీ ఉండవు. రద్దీ ఎక్కువ ఉంటుంది.
ప్రధానంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు పొరుగు రాష్ట్రాల పట్టణాల నుంచి, అలాగే రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, అనంతపురం తదితర ప్రాంతాల నుండి ప్రజలు సంక్రాంతి పండగం సీజన్‌లో రాకపోకలు ఎక్కువగా నిర్వహిస్తారు. కనుక బస్సులు, రైళ్లు రైద్దీగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తుంది. అనంతపురం నుంచి జనవరి 9 నుంచి 20 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
10 శాతం రాయితీ…!
ప్రస్తుతం తిరుగుతున్న సాధారణ సర్వీసులు కాకుండా, ఇప్పుడు సంక్రాంతి పండగ సీజన్‌లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు. అనంతపురం నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలో జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు స్పెషల్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అందులో భాగంగానే అనంతపురం నుంచి 266 సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుమంత్ ఆర్.ఆదోని అన్నారు.
సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధపడిందని తెలిపారు. జనవరి 9 నుంచి 12 వరకు 136 సర్వీసులు, జనవరి 14 నుంచి 20 వరకు 130 బస్సు సర్వీసులను అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేక బస్సుల్లో ఏవిధమైన అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా సాధారణ ఛార్జీలే నిర్ణయించడంతో పాటు రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుమంత్ ఆర్. అదోని వెల్లడించారు.
అయితే స్పెషల్ బస్సులకు రాను, పోనూ ఒకే సారి రిజర్వేషన్ చేసుకుంటే పది శాతం రాయితీ వర్తిస్తుంది. అదే రావడానికి, వెళ్లడానికి వేర్వేరుగా టిక్కెట్టు బుక్ చేసుకుంటే పది శాతం రాయితీ వర్తించదు. పది శాతం రాయితీ వర్తించాలంటే, తప్పని సరిగా ఒకే సారి రెండువైపు టిక్కెట్టు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం