Telugu News  /  Andhra Pradesh  /  Apsrtc Sankranti Special Bus Reservations Starts From January 6th Without Additional Charges
సంక్రాంతి పండుగ కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

APSRTC Reservations : నేటి నుంచి అందుబాటులోకి సంక్రాంతి ప్రత్యేక సర్వీసులు…

06 January 2023, 11:23 ISTHT Telugu Desk
06 January 2023, 11:23 IST

APSRTC Reservations ఏపీఎస్‌ ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. పండుగ ప్రయాణాల కోసం ఆర్టీసి ప్రత్యేక బస్సుల్ని ఇప్పటికే సిద్ధం చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సుల్ని నడుపుతోంది. ప్రయాణికుల కనెక్టివిటీ కోసం విజయవాడ కేంద్రంగా వెయ్యి బస్సుల్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సిద్ధం చేసింది.

APSRTC Reservations ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు నేటి నుంచే రోడ్డెక్కనున్నాయి. పండుగ స్పెషల్ బస్సుల టికెట్ ధరను సాధారణ బస్సు ఛార్జీల మాదిరే వసూలు చేయనున్నట్లు ఆర్టీసి ప్రకటించింది. గతంలో పండుగ ప్రత్యేక సర్వీసులపై 50 శాతం వరకు ధరలు పెంచేవారు. అయితే ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు ఈసారి చార్జీలు పెంచకపోగా ప్రత్యేక రాయితీలతో ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రణాళికలు రచించారు.

ట్రెండింగ్ వార్తలు

పండుగ ప్రత్యేక బస్సుల్లో ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ ప్రయాణికులు ‘ప్రైవేటు’ బస్సుల వైపు చూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రానుపోను ఒకేసారి రిజర్వు చేయించుకుంటే 10 శాతం, నలుగురికి మించి కుటుంబ సభ్యులు అందరూ ఒకేసారి ప్రయాణిస్తే 5 శాతం రాయితీ ఇస్తోంది. అలాగే, ఏపీఎస్‌ఆర్టీసీ వాలెట్ ద్వారా టికెట్ కొనుగోలు చేస్తే 5 శాతం, వృద్ధుల చార్జీల్లో 25 శాతం తగ్గింపు ప్రకటించింది.

సంక్రాంతి ప్రత్యేక బస్సులు నేటి నుంచి ఈ నెల 14 వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తంగా 3,120 బస్సులను అధికారులు సిద్ధం చేశారు. పండుగ అనంతరం తిరిగి వచ్చే వారి కోసం 3,280 బస్సులు నడపనున్నారు. ఇవి ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఆర్టీసీ యాప్, వెబ్‌సైట్, అధికారిక ఏజెంట్ల ద్వారా రిజర్వేషన్ చేయించుకుని ప్రకటించిన రాయితీలు పొందొచ్చని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

12రోజుల పాటు ప్రత్యేక బస్సులు….

సంక్రాంతి పండుగ ప్రయాణాలకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని ప్రకటించారు. జనవరి ఆరు నుంచి 18వరకు 12 రోజుల పాటు పండుగ ప్రత్యేక బస్పుల్ని నడిపేందుకు ఆర్టీసి ఏర్పాట్లు చేస్తోంది. ఈ సీజన్‌లో మొత్తం 6400 ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు చెప్పారు.

APSRTC Special Buses పండుగ ప్రయాణాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని ప్రకటించింది. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఇప్పటికే ప్రత్యేక సర్వీసుల్ని ప్రకటించగా తాజాగా ఏపీఎస్‌ఆర్టీసీ స్పెషల్ సర్వీసుల్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. రెండు వైపులా ప్రయాణాలకు మొత్తం 6400 ప్రత్యేక బస్సుల్ని పండుగ సమయంలో నడుపనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేశారు.

సంక్రాంతి ప్రయాణాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికుల కోసం 6400 ప్రత్యేక సర్వీసుల్ని ఏపీఎస్‌ ఆర్టీసీ నడుపనుంది. జనవరి ఆరవ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఏపీలోని వివిధ ప్రాంతాలకు 3120 బస్సుల్ని నడుపనున్నారు. తిరుగు ప్రయాణాల కోసం జనవరి 15 నుంచి 18 తేదీల మధ్య 3280 బస్సుల్ని నడుపుతారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల నుంచి 3600 బస్సుల్ని ఏపీలోని వివిధ ప్రాంతాలకు నడుపనున్నారు. బెంగళూరు నుంచి 430, చెన్నై నుంచి 150 బస్సుల్ని ఏపీలోని వివిధ ప్రాంతాలకు నడుపనున్నారు.

ఏపీఎస్‌ఆర్టీసీ భారీగా ఆదాయం…..

కోవిడ్‌ తర్వాత ఆర్టీసీకి భారీగా ఆదాయం పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం ఆర్టీసిఃకి టిక్కెట్ల రూపంలో రూ.3,448కోట్ల రుపాయల ఆదాయం సమకూరితే నవంబర్ నాటికి రూ.2683కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది నవంబర్‌ చివరకు గత ఏడాది మొత్తం లభించిన ఆదాయం కంటే ఎక్కువ లభించింది. ఈ ఏడాది నవంబర్ చివరకు రూ.3,866కోట్ల ఆదాయం ఆర్టీసి లభించింది. ఆర్ధిక సంవత్సరం ముగిసేసమయానికి అది భారీగా పెరుగతుందని అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆక్సుపెన్సీ 63శాతం ఉంటే ఈ ఏడాది 68శాతానికి పెరిగింది.

టాపిక్