APSRTC : సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్,విజయవాడ నుంచి 1350, విశాఖ నుంచి 800 స్పెషల్స్
APSRTC Sankranti Special : సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. విజయవాడ నుంచి 1,350, విశాఖపట్నం నుంచి 800 స్పెషల్ బస్సు సర్వీసులను నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సన్నాహాలు చేస్తుంది.
APSRTC Sankranti Special : సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. విజయవాడ నుంచి 1,350, విశాఖపట్నం నుంచి 800 స్పెషల్ బస్సు సర్వీసులను నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఇది సంక్రాంతికి తమ సొంతూర్లు వెళ్లేవారికి గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతి సమయంలో బస్సులు, రైళ్లు రద్దీగా ఉంటాయి.
సంక్రాంతి ఆంధ్రప్రదేశ్‌లో బాగా జరుపుకుంటారు. కనుక ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు, ఉపాధి పనులు, చదువు నిమిత్తం ఉన్నవారు సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌లో తమ సొంతూర్లకు వస్తారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉపాధి పనులు, ఉద్యోగాలు, చదువుకున్న విద్యార్థులు తమ సొంతూర్లకు వెళ్తారు. అలాగే పండగ ముగించుకుని తిరిగి సొంతూర్ల నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్తారు. కనుక సంక్రాంతి సీజన్‌లో బస్సులు, రైళ్లు ఖాళీ ఉండవు. రద్దీ ఎక్కువ ఉంటుంది.
ప్రధానంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు పొరుగు రాష్ట్రాల పట్టణాల నుంచి, అలాగే రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి ప్రజలు సంక్రాంతి పండుగ సీజన్‌లో రాకపోకలు ఎక్కువగా నిర్వహిస్తారు. కనుక బస్సులు, రైళ్లు రద్దీగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తుంది. జనవరి 10 నుంచి 20 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రస్తుతం తిరుగుతున్న సాధారణ సర్వీసులు కాకుండా, ఇప్పుడు సంక్రాంతి పండగ సీజన్‌లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, శ్రీకాకుళం, విజయనగరం, రాజాం, పాలకొండ, రాజమండ్రి, అమలాపురం, తిరుపతి, కడప, అనంతపురంతో పాటు రాయలసీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు స్పెషల్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అందులో భాగంగానే 1,350 సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. గత సంక్రాంతికి విజయవాడ నుంచి 1,310 స్పెషల్ సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ నడిపింది. దాదాపు 7.31 లక్షల కిలో మీటర్ల మేర ఆ సర్వీసులు రాకపోకలు నిర్వహించాయి. దీనిద్వారా ఆర్టీసీకి రూ.3.06 కోట్ల ఆదాయం వచ్చింది.
సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధపడింది. జనవరి 10 నుంచి సర్వీసులను అందుబాటులోకి రానున్నాయి. విశాఖపట్నం నగరం నుంచి 800 స్పెషల్ సర్వీసులను నిర్వహించనున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగం, పార్వతీపురం, సాలూరు, చీపురపల్లి, రాజాం, టెక్కలి, ఇచ్చాపురం, పలాస, పాలకొండ ప్రాంతాలకు స్పెషల్ బస్సు సర్వీసులను వేయనున్నారు. అందుకు అనుగుణంగా బస్సుల కండీషన్లను మెరుగుపరిచేలా చూడాలని విశాఖపట్నం రీజనల్ మేనేజర్ బి. అప్పలనాయుడు అధికారులను ఆదేశించారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం