APSRTC : ప్రైవేట్ కొరియర్ కంపెనీలతో పోటీకి ఆర్టీసి సై….
ప్రయాణికుల రవాణాతో పాటు సరకు రవాణా వ్యాపారంలో ఏపీఎస్‌ఆర్టీసి దూసుకుపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా లాజిస్టిక్స్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తుండటంతో గణనీయంగా లాభాలు నమోదు చేస్తోంది. ఇప్పుడు ప్రైవేట్ ధీటుగా డోర్ డెలివరీ సదుపాయాన్ని విస్తృతం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించిన లాజిస్టిక్స్ - సరకు రవాణా వ్యాపారం లాభాల్లో సాగుతోంది. ఐదేళ్ల క్రితం సరకు రవాణా వ్యాపారంలోకి అడుగు పెట్టిన ఆర్టీసి వినూత్న కార్యక్రమాలతో దూసుకెళ్తోంది.
ట్రెండింగ్ వార్తలు
ఏపీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. 2015-16 సంవత్సరంలో రూ.10కోట్ల లాభాలతో మొదలైన ఆర్టీసి వ్యాపారం 21-22 సంవత్సరానికి రూ.122కోట్ల రుపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో డోర్ డెలీవరి సదుపాయాన్ని కూడా ఏపీఎస్‌ఆర్టీసి ప్రారంభించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 84 పట్టణాలలో 50కేజీలలోపు సరుకు 24 గంటల్లోనే ఇంటికి చేరవేసే సదుపాయన్ని ప్రారంభించింది. ప్రతి పట్టణంలో 10కి.మీలో విస్తీర్ణంలో ఆర్టీసి డోర్ డెలీవరి సదుపాయాన్ని అందిస్తున్నారు.ప్రస్తుతం ఆర్టీసి లాజిస్టిక్స్ విభాగం రోజుకు సగటున 23వేల పార్సిల్స్ బుక్ చేస్తోంది. వీటి ద్వారా 42 లక్షల రుపాయల ఆదాయం సమకూరింది. 2022-23లో 250కోట్ల వ్యాపారాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నారు.ఆర్టీసి లాజిస్టిక్స్ వ్యాపారాన్ని విస్తరించేందుకు కార్గో ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేశారు. ఇతర కొరియర్, పార్సిల్ సర్వీసుల కన్నా తక్కువ రవాణా ఛార్జీలతో డోర్ డెలివరీ సదుపాయాలను కల్పిస్తున్నారు.
ఆర్టీసి లాజిస్టిక్స్ విభాగం ఇప్పటి వరకు వాణిజ్య కార్యక్రమాలు, సరకు రవాణా, వ్యాపార సంస్థలకు సంబంధించిన సరకు రవాణపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. తాజాగా సామాన్య ప్రజానీకానికి అవసరమైన పార్సిల్స్ రవాణా సౌకర్యాన్ని కూడా గత ఏడాది అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆర్టీసిలో పార్సిల్స్ రవాన సదుపాయంతో వేగంగా గమ్యస్థానాలకు చేరుతుండటంతో వాటికి ఆదరణ పెరిగింది. ఆర్టీసి డ్రైవర్ల వద్దే పార్సిల్స్ బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున వీటికి ఆదరణ లభిస్తోంది. తక్కువ దూరంలో ఉండే పట్టణాలు, నగరాల మధ్య వేగంగా పార్సిల్స్ పంపడానికి ఈ సదుపాయం ఉపయోగపడుతోంది.