APSRTC Special Buses : రాజమండ్రి నుంచి సువార్త యాత్ర స్పెషల్.. విశాఖపట్నం నుంచి భద్రాచలానికి సర్వీసులు
APSRTC Special Buses : హిందూ, క్రైస్తవ భక్తులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. రాజమండ్రి నుంచి సువార్త యాత్ర స్పెషల్ పేరుతో ప్రసిద్ధి చర్చలను సందర్శించేందుకు లగ్జరీ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీరామనవమి పురస్కరించుకుని విశాఖ నుంచి భద్రాచలానికి సర్వీసులను నడపనుంది.
సువార్త యాత్రలో భాగంగా ఐదు రోజుల పాటు ఎనిమిది క్షేత్రాలను, మెరీనా బీచ్ వంటి మూడు ప్రదేశాల సందర్శన ఉంటుంది. సూపర్ లగ్జరీ బస్సులో ఫుష్‌బ్యాక్ 2+2 సీట్లు, టీవీ సౌకర్యం ఉంటుంది. ఒక్కొక్క టిక్కెట్టు ధర రూ.6,500 ఉంటుంది. నాలుగు కంటే ఎక్కువ టిక్కెట్లు తీసుకుంటామని చెబితే.. వారి ఇంటికి వెళ్లి టిక్కెట్లు ఇస్తారు. ఈ ప్యాకేజీలో మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెడతారు. ఉదయం టిఫిన్ పెట్టరు. అలాగే ఎక్కడైనా నైట్ హాల్ట్ చేసేటప్పుడు రూమ్స్ తీసుకుంటే.. దానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
మే 5న మధ్యాహ్నం..
బస్సు రాజమండ్రి డిపో నుంచి మే 5న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. నిర్మల గిరిలోని గౌరీపట్నం, చెన్నైలో సెయింట్ థామస్ మౌంట్, అపోస్తుథామస్ నివసించిన క్షేత్రం, పోప్ జాన్‌పాల్ దర్శించిన క్షేత్రం, లిటిల్ మౌంట్ పైన్ (మోకాళ్ల పర్వతం), శాంతమ్ కాథడ్రల్ చర్చ్, 14వ శతాబ్దాపు చర్చ్ అపోస్తు థామస్ సమాధి, సెయింట్ మేరీస్ చర్చ్ (దేశంలో అత్యంత పురాతనమైన ఆంగ్లేయన్ చర్చ్), మెరీనా బీచ్‌ను సందర్శించవచ్చు. వేళంగనిలోని నాగపట్నం చర్చ్, గుణదల చర్చ్‌ను కూడా సందర్శించవచ్చు. టిక్కెట్లు కావల్సిన వారు 9502300189, 9966666544, 9866045588 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
శ్రీరామనవమికి..
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని.. ఏప్రిల్ 5న విశాఖపట్నంలోని మధురవాడ డిపో నుంచి భద్రాచలం వరకు రెండు స్పెషల్ బస్సు సర్వీసులను నడపనున్నట్లు.. ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి. అప్పలనాయుడు తెలిపారు. టిక్కెట్లను ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలోనూ, ఏపీఎస్ ఆర్టీసీ వెబ్‌సైట్‌లోనూ బుక్ చేసుకోవచ్చని వివరించారు. తక్కువ ధరలతో శ్రీరాముని పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఈ సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు.
బుకింగ్ కోసం..
భద్రాచలం సర్వీసులకు సంబంధించి బుకింగ్ కోసం 9552300009 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. అలాగే టిక్కెట్టు ధరలు, సర్వీసులు ఎప్పుడు బయలుదేరుతాయి వంటి సమాచారం కూడా అందిస్తారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అప్పలనాయుడు కోరారు. ఏపీఎస్ఆర్టీసీ ఎల్లప్పుడూ భక్తులకు, యాత్రికులకు సౌలభ్యం కోసం స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)