APSRTC Kumbh Mela: ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్, విజయవాడ నుంచి మహా కుంభమేళకు ప్రత్యేక బస్సులు
APSRTC Kumbh Mela: మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ భక్తుల సౌకర్యార్థం ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు స్పెషల్ సర్వీసులును వేసింది. విజయవాడ నుంచి మహా కుంభమేళాకి స్పెషల్ సర్వీస్ నడుపుతోంది.
APSRTC Kumbh Mela: కుంభమేళాకు వెళ్లే వారికి ఏపీఎస్‌ఆర్టీసీ విజయవాడ నుంచి ప్రత్యేక సర్వీస్ ప్రకటించింది. యాత్రికులు ఈ బస్సు సర్వీస్ వినియోగించుకోవాలని ఆర్టీసీ కోరుతోంది. ఇతర ఆధ్యాత్మిక ప్రాంతాల పర్యటన సర్వీసులానే ఈ బస్సు సర్వీస్‌లు కూడా మహా కుంభమేళాను సందర్శించేందుకు తీసుకెళ్తుంది.

ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బట్టీ, ప్రయాణీకులు, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతితక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లోని మహా కుంభమేళాకి ఈ బస్సు సర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది.
మొత్తం ఎనిమిది రోజుల పాటు యాత్ర కొనసాగుతోంది. 3,600 కిలో మీటర్ల మేరా యాత్ర ఉంటుందని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.వై దానం తెలిపారు. మహా కుంభమేళా జరిగే ప్రయాగరాజ్‌తో అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాల దర్శనం కూడా ఉంటుందన్నారు.
ప్యాకేజీ ఇలా
ఫిబ్రవరి 1 తేదీన ఉదయం విజయవాడ పీఎన్‌బీఎస్ నుంచి బస్సులు బయలుదేరుతాయి. ఫిబ్రవరి 2న సాయంత్రం ప్రయాగరాజ్ చేరుకుంటాయి. ఫిబ్రవరి 3 తేదీన ప్రయాగరాజ్‌లోనే బస ఉంటుంది. రాత్రి అయోధ్యకు ప్రయాణం అవుతోంది. ఫిబ్రవరి 5న ఉదయం అయోధ్య చేరుకుని బాల రాముడి దర్శనం చేసుకుంటారు.
అక్కడ నుంచి రాత్రికి వారణాసి ప్రయాణం అవుతారు. ఫిబ్రవరి 6 తేదీన వారణాసి చేరుకుని అక్కడే రాత్రికి బస చేస్తారు. ఫిబ్రవరి 7న ఉదయం వారణాసి నుంచి బయలుదేరుతారు. ఫిబ్రవరి 8న బస్సులు విజయవాడ చేసుకుంటాయి.
ఎనిమిది రోజులు పాటు యాత్ర కొనసాగుతుంది. ప్రయాగ రాజ్, కాశీ క్షేత్రాల్లో ఒక రోజు బస ఉంటుంది. ఈ యాత్రలో పిల్లలు, పెద్దలకు ఒకటే ఛార్జీ ఉంటుంది. టిక్కెట్టు ధర రెండు వైపుల కలిపి ఒక్కరికి సూపర్ లగ్జరీ సర్వీస్‌కు రూ.8,000, స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ రూ. 11,000, వెన్నెల ఏసీ స్లీపర్ రూ.14,500గా ఆర్టీసీ నిర్ణయించింది. ఇవి టిక్కెట్టు ఛార్జీలు మాత్రమే. భోజనం, వసతి ఖర్చులు వారే పెట్టుకోవాల్సి ఉంటుంది.
టిక్కెట్టు కావాలనుకునేవారు ఆన్‌లైన్‌లోనూ, సమీప బస్ స్టేషన్, ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్లను సంప్రదించాలి. అప్పుడే టిక్కెట్టు బుక్ చేసుకోవడం అవుతుంది. యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కోరుతోంది. అదనపు సమచారం కోసం 8074298487, 08662523926, 08662523928 నంబర్లను సంప్రదించండి.
ఏపీఎస్ఆర్టీసీ సాంకేతకతను ఉపయోగించి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తోంది. what3wards///App సహాయంతో ప్రయాణీకులందరూ ఎక్కడ ఉన్నా బస్సు వద్దకు చేరుకోవచ్చు. ఈ యాప్‌ను బస్సు బయలుదేరేనప్పుడు ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ యాప్ వల్ల ప్రయాణికులు చాలా ప్రయోజనం కలుగుతోంది. బస్సు ఎక్కడుందో అందులో స్పష్టం అవుతుంది. భక్తులు తప్పిపోకుండా ఉండేందుకు ఈ సాంకేతికతను తీసుకొచ్చినట్లు ఆర్టీసీ చెబుతోంది.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)