APSRTC Buses : ఆ ప్రచారం నమ్మొద్దు, బస్సుల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేవు- ఏపీఎస్ఆర్టీసీ
APSRTC Buses : చంద్రబాబు అరెస్టుతో ఏపీలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటన జారీ చేసింది. బస్సులు రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేవని ప్రకటించింది.
APSRTC Buses : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అయితే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీఎస్ఆర్టీసీ అధికారులు స్పందించారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. యథావిధిగా అన్ని సర్వీసులు నడుస్తాయన్నారు. ప్రయాణికులు యథా ప్రకారం తమ ప్రయాణాలు చేసుకోవచ్చని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటన జారీ చేసింది. ఏపీలోప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపింది. చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఆర్టీసీ బస్సులను ఎందుకు నిలిపివేస్తామని వివరణ ఇచ్చారు.
ఏపీ, తెలంగాణ మధ్య బస్సుల రాకపోకలు యథాప్రకారమే
ఏపీ, తెలంగాణ మధ్య నిత్యం వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటాయని అధికారులు తెలిపారు. అన్ని సర్వీసులు యథావిధిగా నడుస్తు్న్నాయని, రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు లేవని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారమే అన్ని సర్వీసులు తిప్పుతున్నామని అధికారులు తెలిపారు. దూర ప్రాంత ప్రయాణికులు సోషల్ మీడియా పుకార్లను నమ్మొద్దని ఆర్టీసీ వివరణ ఇచ్చింది. విజయవాడ-హైదరాబాద్ మధ్య ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ బస్సులు షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నాయని తెలిపింది. ఎక్కడా బస్సులు నిలిపివేయలేదని ప్రయాణికులు గమనించాలని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
పలు ప్రాంతాల్లో డిపోలకే బస్సులు పరిమితం
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల సూచనతో ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారని ప్రచారం జరిగింది. తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో డిపోలు, బస్టాండ్ల వద్దకు వెళ్లిన పోలీసులు ఆర్టీసీ బస్సులు రాకపోకలను నిలిపివేశారని వార్తలు వచ్చాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తిరిగే బస్సులు నిలిచిపోయాయి. విజయవాడలో సిటీ బస్సులు కూడా కదల్లేదు. ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిక పోలీసుల సూచనల మేరకే బస్సులు రాకపోకలపై నియత్రించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. అయితే ఆర్టీసీ యాజమాన్యం బస్సుల రాకపోకలపై ఆంక్షలు లేవని ప్రకటించింది. బస్సులు యథాప్రకారం తిరుగుతున్నాయని ప్రకటించింది.
విశాఖలో కూడా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ద్వారకానగర్ బస్ స్టేషన్‌లో ప్రయాణికులను దింపేసి బస్సులను డిపోలకు తరలించారు. టికెట్లు తీసుకున్నా ప్రయాణికులకు డబ్బులు వాపస్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే ఇదంతా మౌఖిక ఆదేశాల ప్రకారమే జరగడంతో ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. బస్సులు రాకపోకలపై ఆంక్షలు లేవని చెబుతున్నారు. అధికారులు ఆంక్షలు లేవని చెబుతున్నా... చాలా ప్రాంతాల్లో బస్సులు తక్కువ సంఖ్యలోనే తిరుగుతున్నాయని తెలుస్తోంది.