APSRTC Special Buses : సంక్రాంతికి 6400 ప్రత్యేక బస్సులు….సాధారణ ఛార్జీలు వసూలు-apsrtc anounced sankranti special bus services between telugu states and other locations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Apsrtc Anounced Sankranti Special Bus Services Between Telugu States And Other Locations

APSRTC Special Buses : సంక్రాంతికి 6400 ప్రత్యేక బస్సులు….సాధారణ ఛార్జీలు వసూలు

HT Telugu Desk HT Telugu
Dec 20, 2022 06:43 AM IST

APSRTC Special Buses సంక్రాంతి పండుగ ప్రయాణాలకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని ప్రకటించారు. జనవరి ఆరు నుంచి 18వరకు 12 రోజుల పాటు పండుగ ప్రత్యేక బస్పుల్ని నడిపేందుకు ఆర్టీసి ఏర్పాట్లు చేస్తోంది. ఈ సీజన్‌లో మొత్తం 6400 ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు చెప్పారు.

ఏపీఎస్ ఆర్టీసీ
ఏపీఎస్ ఆర్టీసీ (Hindustan times)

APSRTC Special Buses పండుగ ప్రయాణాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని ప్రకటించింది. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఇప్పటికే ప్రత్యేక సర్వీసుల్ని ప్రకటించగా తాజాగా ఏపీఎస్‌ఆర్టీసీ స్పెషల్ సర్వీసుల్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. మొత్తం 6400 ప్రత్యేక బస్సుల్ని పండుగ సమయంలో నడుపనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

సంక్రాంతి ప్రయాణాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికుల కోసం 6400 ప్రత్యేక సర్వీసుల్ని ఏపీఎస్‌ ఆర్టీసీ నడుపనుంది. జనవరి ఆరవ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఏపీలోని వివిధ ప్రాంతాలకు 3120 బస్సుల్ని నడుపనున్నారు. తిరుగు ప్రయాణాల కోసం జనవరి 15 నుంచి 18 తేదీల మధ్య 3280 బస్సుల్ని నడుపుతారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల నుంచి 3600 బస్సుల్ని ఏపీలోని వివిధ ప్రాంతాలకు నడుపనున్నారు. బెంగళూరు నుంచి 430, చెన్నై నుంచి 150 బస్సుల్ని ఏపీలోని వివిధ ప్రాంతాలకు నడుపనున్నారు.

ఆర్టీసి ప్రత్యేక బస్సుల్లో ప్రయాణాలకు ఆన్లైన్ రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించనున్నారు. రెండు వైపులా ప్రయాణాలకు టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి పది శాతం రాయితీ కల్పిస్తారు. అన్ని దూర ప్రాంత సర్వీసులకు ఈ రాయితీ వర్తిస్తుంది. పండుగ రద్దీని తట్టుకునేందుకు అదనపు సిబ్బందిని ఆర్టీసి వినియోగిస్తోంది. జిల్లా కేంద్రాలతో పాటు ప్రధానమైన ప్రాంతాలకు ఎక్కువ బస్సు సర్వీసుల్ని ఏర్పాటు చేసినట్లు ఎండీ ప్రకటించారు. ఆర్టీసి ప్రత్యేక బస్సుల్లో సాధారణ బస్సుల్లో ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నట్లు తెలిపారు. నెలాఖరుకల్లా పిఓఎస్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

ఏపీఎస్‌ఆర్టీసీ భారీగా ఆదాయం…..

కోవిడ్‌ తర్వాత ఆర్టీసీకి భారీగా ఆదాయం పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం ఆర్టీసిఃకి టిక్కెట్ల రూపంలో రూ.3,448కోట్ల రుపాయల ఆదాయం సమకూరితే నవంబర్ నాటికి రూ.2683కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది నవంబర్‌ చివరకు గత ఏడాది మొత్తం లభించిన ఆదాయం కంటే ఎక్కువ లభించింది. ఈ ఏడాది నవంబర్ చివరకు రూ.3,866కోట్ల ఆదాయం ఆర్టీసి లభించింది. ఆర్ధిక సంవత్సరం ముగిసేసమయానికి అది భారీగా పెరుగతుందని అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆక్సుపెన్సీ 63శాతం ఉంటే ఈ ఏడాది 68శాతానికి పెరిగింది.

కార్గో రవాణా ద్వారా ఆర్టీసీకి భారీగా ఆదాయం లభిస్తోంది. గత ఏడాది రూ.122 కోట్ల ఆదాయం ఆర్టీసికి లభించింది. ఈ సారి ఇప్పటికే రూ.118కోట్ల రుపాయల ఆదాయం వచ్చింది. మార్చి నెలాఖరుకు కార్గో ఆదాయం రూ.165కోట్లకు చేరే అవకాశాలున్నాయి. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు కూడా వేగంగా పూర్తి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వారసుల్లో ఇప్పటికే 191 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో జిల్లాల వారీగా కలెక్టర్లు ఉద్యోగాలను భర్తీ చేసిన తర్వాత మిగిలిన వారిని ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్లు, డ్రైవర్, కండక్టర్‌, శ్రామిక్ ఉద్యోగాల్లో నియమిస్తామని చెప్పారు.

IPL_Entry_Point

టాపిక్