APSRTC Buses : శ్రీశైలం మల్లన్న దర్శనానికి 453 ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు- ఫిబ్రవరి 19 నుంచి 28 వరకు అందుబాటులో
APSRTC Special Buses : మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి 453 ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. ఫిబ్రవరి 19 నుంచి 28 వరకు ఈ స్పెషల్ సర్వీసులు రాకపోకలు నిర్వహించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

APSRTC Special Buses : మహాశివరాత్రి నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు లక్షలాది మంది తరలివస్తారు. ప్రయాణికులు, భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 28 వరకు బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. ఆయా రోజుల్లో శివ దీక్షాపరులకు 19 నుంచి 23 వరకు స్పర్శ దర్శనం కల్పిస్తారు. అలాగే ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో భక్తులు రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇతర జిల్లాల నుంచి అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతేడాది 382 బస్సులు నడపగా, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది బస్సుల సంఖ్యను పెంచారు. ఈ ఏడాది 453 బస్సులను నడిపేలా ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రణాళికులు సిద్ధం చేశారు.
ఏఏ జిల్లాల నుంచి ఎన్ని బస్సులు?
శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి ఉమ్మడి కర్నూలు జిల్లా 198 బస్సులు, అనంతపురం జిల్లా నుంచి 60 బస్సులు, శ్రీసత్యసాయి జిల్లా నుంచి 45 బస్సులు, కడప జిల్లా నుంచి 10 బస్సులు, నెల్లూరు జిల్లా నుంచి 60 బస్సులు, చిత్తూరు జిల్లా నుంచి 20 బస్సులు, తిరుపతి జిల్లా నుంచి 40 బస్సులు, అన్నమయ్య జిల్లా నుంచి 20 బస్సులు అందుబాటులో తీసుకొచ్చారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా 198 బస్సుల్లో కర్నూలు-1 నుంచి 29, కర్నూలు-2 నుంచి 31, పత్తికొండ నుంచి 3, ఎమ్మిగనూరు నుంచి 23, ఆళ్లగడ్డ నుంచి 10, ఆత్మకూరు నుంచి 5, బనగానపల్లి నుంచి 10, డోన్ నుంచి 15, కోవెలకుంట్ల నుంచి 14, నందికొట్కూరు నుంచి 18, నంద్యాల నుంచి 16, ఆదోని నుంచి 24 బస్సులు నడపనున్నారు.
మహా శివరాత్రి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలంతో పాటు మహానంది, యాగంటి, ఓంకారం, గుండ్ల బ్రహ్మేశ్వరం, నగరంలోని జగన్నాథగట్టు, సంగమేశ్వరం తదితర శైవ క్షేత్రాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికులు వేస్తున్నారు.
అదనపు ఛార్జీలు ఉండవు
ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి శ్రీశైలానికి 198 బస్సులు సిద్ధంగా ఉంచామని కర్నూలు, నంద్యాల జిల్లా ప్రజా రవాణాధికారులు జి.శ్రీనివాసులు, రజియాసుల్తా తెలిపారు. బస్సుల కండీషన్ తనిఖీ చేసిన తరువాతే బయటకు పంపుతామని అన్నారు. ఘాట్ రోడ్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెకానిక్, ట్రాఫిక్ బృందాల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవని, సాధారణ చార్జీలతోనే బస్సులు నడుపుతామని పేర్కొన్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం