Telugu News  /  Andhra Pradesh  /  Apsrtc And Ksrtc Comes Under Mou For Inter State Transport Arrangements
కర్ణాటకతో ఒప్పందం చేసుకుంటున్న ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండి
కర్ణాటకతో ఒప్పందం చేసుకుంటున్న ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండి

APSRTC And KSRTC : ఏపీ-కర్ణాటక మధ‌్య పెరుగనున్న బస్సులు….

03 February 2023, 7:06 ISTHT Telugu Desk
03 February 2023, 7:06 IST

APSRTC And KSRTC ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక మధ్య బస్సు సర్వీసుల్ని విస్తరించాలని రెండు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలుె నిర్ణయించాయి. ఈ మేరకు ఏపీఎస్‌ ఆర్టీసీతో కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంతరాష్ట్ర రవాణా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కొత్త ఒప్పందం ద్వారా ఏపీఎస్‌ ఆర్టీసీ, కర్ణాటక ఆర్టీసీ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ బస్సుల్ని నడుపుతాయి.

APSRTC And KSRTC కర్ణాటక, ఏపీల మధ‌్య ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించే క్రమంలో భాగంగా ప్రభుత్వ రోడ్డు రవాణా సదుపాయాలను మెరుగు పరచాలని ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు కల్పించనున్నారు. వచ్చే మూడు నెలలలో కార్యాచరణకు ఏపీఎస్ ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసి సేవల్ని విస్తరించే క్రమంలో పొరుగు రాష్ట్రాలతో ఏపీఎస్‌ఆర్టీసీ ఒప్పందాలు చేసుకుంటోంది. అందులో భాగంగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు బస్సు సర్వీసులు పెంచే విధంగా అడుగులు వేస్తోంది. కర్నాటక ఆర్టీసీ తో ఏపీఎస్ ఆర్టీసి, ఇంటర్ స్టేట్ ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రయాణీకుల నుండి సేకరించిన అభిప్రాయాలకు అనుగుణంగా రెండు రాష్ట్రాల్లో బస్సు సర్వీసులు పెంచాలని స్ ఆర్టీసీలు నిర్ణయించి పలు దఫాలుగా అధికారులతో చర్చించారు. వరుస సమావేశాల తర్వాత ఎట్టకేలకు విజయవాడలో ఇరు ఆర్టీసీ ఎం.డి. ల మధ్య జరిగిన సమావేశంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఆర్టీసీ హౌస్ ప్రధాన కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కొన్ని కొత్త రూట్ల ప్రతిపాదనలతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారి తొలిసారిగా ఏపీఎస్ ఆర్టీసీ ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఏపీ ఆర్టీసీ ద్వారా 69,284 కిలోమీటర్లతో 327 బస్సులు పెంచాలని, అదేవిధంగా కర్ణాటక ద్వారా 69,372 కిలోమీటర్లతో 496 బస్సులను కొత్తరూట్లలలో పెంచడానికి ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది.

ఈ ఒప్పందం అమలులోకి రావడంతో కర్ణాటకలో ఏపీఎస్ ఆర్టీసీ కి చెందిన 1322 బస్సులు 2,34,762 కిలోమీటర్లు తిరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో కెఎస్ ఆర్టీసీ కి చెందిన 1489 బస్సులు 2,26,044 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. రెండు రాష్ట్రాల మధ్య ప్రజా రవాణా మెరుగుపరచడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థల సిఫార్సులను సంబంధిత ప్రభుత్వాల పరిశీలనకు పంపుతారు.వచ్చే 3 నెలల వ్యవధిలో కొత్త కార్యాచరణ అమలులోకి తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తోంది.

కెఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.అంబు కుమార్, ఏపీఎస్‌ఆర్టీసీ ఎం.డి. ద్వారకా తిరుమల రావులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇప్పటికే ఆర్టీసీ ద్వారా ఏపీ-ఒడిస్సా మధ్య బస్సులు పెంచేందుకు వీలుగా ప్రభుత్వానికి సిఫార్సులు చేశారు. ఇరు రాష్ట్రాల అంతరాష్ట్ర ఒప్పందంలో భాగంగా నడపవలసిన బస్సులు, రూట్ల జాబితాను డిసెంబర్ 12, 2022 న ప్రభుత్వం డ్రాఫ్ట్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కర్ణాటకతో చేసుకున్న ఒప్పందంతో ప్రయాణికుల మరిన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

టాపిక్