APSDMA Helpline : ఈ భారీ వర్షాల వేళ జాగ్రత్త..! అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే
ఏపీలో వర్షాలు, వరదలపై విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ఆదేశాలను జారీ చేశారు. గోదావరి, కృష్ణా , తుంగభద్ర ఇతర నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రజలకు అత్యవసర సేవలను అందించేందుకు APSDMA హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. విపత్తుల సంస్థ ఆపరేషన్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షించారు.
భారీ వర్షాలు, వరదలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వాయుగుండం అర్ధరాత్రి విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటే వకాశం ఉందన్నారు, రేపు చాలా చోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులతో కలసి ఎప్పటికప్పుడు వర్షాభావ పరిస్థితులు, వాగులు,కాలువలు,రోడ్ల మీద వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు పవర్ రిస్టోరేషన్ సంబంధించిన పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
ఇరిగేషన్ , ఆర్ డబ్ల్యూ ఎస్, హెల్త్, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్ , పడిన చెట్లు వెంటనే తొలగించాలన్నారు. ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించాలని అలాగే ప్రజలు సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరారు.
అప్రమత్తంగా ఉండాలి…
రానున్న రెండు రోజులు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొంగిపొర్లే రోడ్లు, కాలువలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు , పడిపోయిన విద్యుత్ లైన్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయోద్దని కోరారు. రోడ్ల మీద వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పూర్తి స్థాయిలో తగ్గేవరకు రోడ్ల మీదకు రాకుండా సహకరించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ… స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి రెవెన్యూ, పోలిస్, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, విద్యుత్, హెల్త్ అండ్ మెడికల్ తో పాటు ఇతర శాఖలు సమన్వయ పరుచుకొని జిల్లాల్లో క్షేత్రస్థాయిలో సహాయక చర్యలకు ఎటువంటి అటంకం లేకుండా చూడాలన్నారు. అత్యవసర సహాయక చర్యల్లో 4 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నట్లు తెలిపారు.
గోదావరి, కృష్ణా , తుంగభద్ర ఇతర నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. ప్రజలు విపత్తుల నిర్వహణ సంస్థ మేసేజ్లను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070,112, 18004250101, సంప్రదించాలన్నారు.