APPSC Jobs Age Limit : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, ఈ పోస్టులకు వయోపరిమితి పెంపు
APPSC Jobs Age Limit : ఏపీపీఎస్సీ, ఇతర నియామక బోర్డులు నేరుగా భర్తీ చేసే యూనిఫాం, నాన్ యూనిఫాం పోస్టులకు ప్రభుత్వం వయో పరిమితి పెంచింది.
APPSC Jobs Age Limit : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని ఏళ్లుగా ప్రయత్నిస్తు్న్న వారికి వయో పరిమితి అడ్డంకి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ, ఇతర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నేరుగా భర్తీ చేసే యూనిఫాం, నాన్ యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయో పరిమితిని పెంచింది. నాన్ యూనిఫాం ఉద్యోగాలకు వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచింది. అదే విధంగా యూనిఫాం ఉద్యోగాలకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి అదనంగా రెండు సంవత్సరాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ వయోపరిమితి పెంపు 2024 సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాలు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(APCOB) స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. మొత్తం 35 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. దరఖాస్తులకు సంబంధించి సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి నోటిఫికేషన్ లో పేర్కొంది. మొత్తం 35 స్టాప్ అసిస్టెంట్ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానించారు.
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు తెలుగు, ఇంగ్లీష్ భాషలు తెలిసి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. దీంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని పేర్కొంది. వయోపరిమితి 01.10.2023 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలని వెల్లడించించింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.17,900 నుంచి రూ.47,920 జీతం ఇస్తారు. ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్, బీసీల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.700 కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ కు రూ.500 అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.