APPSC Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు!
APPSC Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీలను మార్చే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం 2025 జనవరి 5న మెయిన్స్ ఎగ్జామ్ జరగాలి. కానీ.. జనవరిలో కాకుండా ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించే అవకాశం ఉంది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ పరీక్ష 2025 జనవరి 5న జరగాలి. డీఎస్సీ నోటిఫికేషన్, పరీక్షా కేంద్రాల గుర్తింపు, అభ్యర్థుల ప్రిపరేషన్‌ను దృష్టిలో పెట్టుకొని గతంలో ఏపీపీఎస్సీ ఈ తేదీని ఖరారు చేసింది. కానీ.. డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడటం, అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించాలని ఏపీపీఎస్సీ ప్లాన్ చేస్తోంది. దీనిపై ప్రభుత్వంతో చర్చించాక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. గతే ఏడాది డిసెంబర్‌లో 899 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. జులై నాటికి గ్రూప్ -2 మెయిన్స్ పూర్తి చేయాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడింది. ఇటీవల ఏపీపీఎస్సీ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన అనూరాధ.. గ్రూప్-2 మెయిన్స్ నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. 2025 జనవరి 5న పరీక్ష నిర్వహించాలని.. ఏపీపీఎస్సీ షెడ్యూల్ ప్రకటించింది. గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్షలో 92,250 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు.
గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షను ఈ ఏడాది ఫిబ్రవరి 25న నిర్వహించారు. ఏప్రిల్ 10న ఫలితాలను ప్రకటించారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను రిజెక్ట్ చేశారు. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ తెలిపింది. ఏపీలోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.
గ్రూప్ 2 మెయిన్స్ లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయిస్తారు.