APPSC : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలర్ట్ ఇచ్చింది. ఉద్యోగులకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 12, 13 తేదీల్లో పరీక్ష నిర్వహణకు షెడ్యూల్ చేసింది. ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేస్తూ అందరూ సిద్ధంగా ఉండాలని తెలిపింది.
ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఐ. నరసింహమూర్తి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలలోని కొంతమంది ఉద్యోగులు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ విభాగంలోని పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-V, రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్-1, వీఆర్‌వో గ్రేడ్-1లకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఆయా విభాగాల ఉద్యోగులందరూ కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్షకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
అలాగే 2014 మే 12 తరువాత అన్ని హెచ్‌వోడీలు, డైరెక్టరేట్లు, ఏపీ సెక్రటేరియట్‌ల్లో కారుణ్య ప్రాతిపదికన నియమించబడిన ఉద్యోగులు, రెవెన్యూ శాఖలో వీఆర్‌వో గ్రేడ్-1 కేటగిరీ నుండి పదోన్నతి పొందిన సీనియర్ అసిస్టెంట్లు, కారుణ్య నియామకంలో వీఆర్‌వోలు, సర్వీస్‌లో ఉన్న వీఆర్ఏలకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షను నిర్వహిస్తారు. ఆయా విభాగాలు, కేటగిరీల ఉద్యోగులు కంప్యూటర్ పరిజ్ఞాన సిద్ధంగా ఉండాలని సూచించారు.
పరీక్షను ఏప్రిల్ 12, 13 తేదీల్లో నిర్వహిస్తారు. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లా కేంద్రాల్లో పరీక్షను నిర్వహిస్తారు. కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్ష ఉద్యోగులు తప్పనిసరిగా రాయాలని సూచించింది. అందులో ఎటువంటి మినహాయింపు ఉండదని తెలిపారు. కంప్యూటర్ పరీక్ష ఫలితాలు పదోన్నతలపై ఆధారపడి ఉంటుంది.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో విధులు నిర్వహించేందుకు ఓడీ (ఆన్ డ్యూట్ డిప్యూటేషన్)పై 402 మంది వార్డు సచివాలయ కార్యదర్శులను నియమించనున్నారు. మెప్మాలో 279 కమ్యూ నిటీ ఆర్గనైజర్ పోస్టులను, 123 సుయోగ్ సెంటర్లలోని ఖాళీలను వార్డు కార్యదర్శులతో భర్తీ చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. ఈ మేరకు జీవీఎంసీ, వీఎంసీతో సహా అన్ని అర్బన్ లోకల్ బాడీ (యూఎల్బీ)ల్లోని ప్రాజెక్టు డైరెక్టర్లు సిబ్బందిని కేటాయించాల్సిందిగా మెప్మా ఎండీ తేజ్ భరత్ ఆదేశించారు. అందుకు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డవలప్‌మెంట్ శాఖ అనుమతి ఇచ్చిందని తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం