AP Employees Agitation :పోరు కొనసాగుతుందని ప్రకటించిన ఏపీజేఏసీ నేతలు
AP Employees Agitation డిమాండ్ల పరిష్కారం ఏపీజేఏసీ నేతలు ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఏపీజేఏసీ అమరావతి నేతలు ప్రకటించారు. గురువారం విజయవాడలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన రాష్ట్ర కమిటీలో జిల్లా నేతల అభిప్రాయాల మేరకు ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు.
AP Employees Agitation డిమాండ్ల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని ఏపీజేఏసీ అమరావతి నాయకులు ప్రకటించారు. స్వల్ప మార్పులు మినహా ఉద్యమ కార్యాచరణ అమలుకే ఏపీ ఐకాస అమరావతి మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించారు.
గురువారంనుంచే ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. క్యాబినెట్ సబ్ కమిటీతో జరిగిన సమావేశం, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన రాతపూర్వక మినిట్స్‌లో ఉద్యోగులు ప్రస్తావించిన ముఖ్యమైన అంశాల ప్రస్తావన లేదని ఉద్యోగ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రులు నోటి మాటగానే నెలాఖరు కల్లా డబ్బులు చెల్లిస్తామని చెప్పడంపై అభ్యంతరం చెబుతున్నారు.
ఉద్యోగుల జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, ఈహెచ్‌ఎస్ పథకాల్లో ఉద్యోగులు దాచుకున్న డబ్బులు రూ.3000 కోట్లు నెలాఖరులోగా చెల్లిస్తామన్నారని, చట్టబద్ధంగా రావాల్సిన డీఏ బకాయిలు, ఆర్జిత సెలవులు సుమారు రూ.2000 కోట్లను సెప్టెంబరులోపు రెండు విడతలుగా చెల్లిస్తామన్నారు.ఈ హామీలు మినహా.. చీఫ్ సెక్రటరీకి గత నెల 13వ తేదీన ఇచ్చిన 50 పేజీల విన్నపంలోని ఇతర ఆర్థికపరమైన ప్రధానాంశాలేవీ ప్రస్తావించ లేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
చీఫ్ సెక్రటరీ అందించిన మినిట్స్ నేపథ్యంలో విజయవాడలో జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.క్యాబినెట్ సబ్ కమిటీతో జరిగిన సమావేశం 'మినిట్స్‌లో 11వ పీఆర్సీ పే స్కేల్స్, ప్రత్యేక 'పే'లు, పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏ బకాయిల ప్రస్తావన లేదన్నారు. పీఆర్సీ బకాయిలను సర్వీసు రిజిష్టరులో నమోదు చేయించి పదవీ విరమణ తర్వాత చెల్లిస్తామనడం గతంలో ఎక్కడాలేని విధానమని ఆరోపించారు.
ఉద్యోగులకు రావాల్సిన డీఏలపైనా స్పష్టత లేదని, జీతాలనే ప్రతి నెలా ఒకటిన ఇవ్వలేకపోతున్నారని, సీపీఎస్ రద్దుపై హామీనిచ్చి అమలుచేయలేదని, పాత పింఛను విధానం తప్ప దేన్నీ అంగీకరించబోమని ఉద్యోగులు తేల్చి చెప్పారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పొరుగు సేవల ఉద్యోగుల జీతభత్యాల పెంపునూ పక్కన పెట్టేశారని బొప్పరాజు ఆరోపించారు. ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తున్నందున ఆందోళన కార్యక్రమాలను కొనసాగించాలని నిర్ణయించారు.
ఉద్యమ కార్యాచరణ యథాతథం….
*ఈ నెల 9 నుంచి ఏప్రిల్ 5వరకు నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన తెలుపుతారు. గతంలో ప్రకటించిన జిల్లాకేంద్రాల్లోని కలెక్టరేట్లు, డివిజన్ కేంద్రాల్లోని ఆర్డీవో/సబ్‌కలెక్టర్ కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు ఉండవని తెలిపారు. మార్చి 17, 20 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగ సంఘాల నాయకులు సందర్శిస్తారు. మార్చి 21నుంచి ఏప్రిల్5 వరకు 'వర్క్‌టురూల్' అమలు చేస్తారు. ఈ సమయంలో ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే విధుల నిర్వర్తిస్తారు.
ఏప్రిల్ 5న తిరిగి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తారు. ఈనెల 16న మళ్లీ ఈహెచ్‌ఎస్, పీఆర్సీ బకాయిలపై సీఎస్‌తో చర్చించేందుకు ప్రయత్నిస్తారు. ప్రభుత్వం దిగిరాకపోతే రెండో విడత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమస్యల పరిష‌్కారంలో ప్రభుత్వంపై నమ్మకం లేదని , జేఏసీ నాయకులు ప్రకటించారు. సమస్యలు పరిష్కారమయ్యేవరకు ఉద్యమాన్ని కొనసాగించాల్సిందేనని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నాయకులు డిమాండ్ చేశారన్నారు. ఇప్పుడు ఉద్యమాన్ని వాయిదా వేస్తే.. క్షేత్రస్థాయి నుంచి ప్రతిఘటన వస్తుందనే అభిప్రాయం వ్యక్తమైందని జేఏసీ నేతలు వివరించారు.