APCC President : బీజేపీది మొసలి కన్నీరు.. గ్యాస్ ధర తగ్గింపుతో దృష్టి మరల్చే కుట్ర-apcc president gidugu rudra raju slams bjp govt ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Apcc President Gidugu Rudra Raju Slams Bjp Govt

APCC President : బీజేపీది మొసలి కన్నీరు.. గ్యాస్ ధర తగ్గింపుతో దృష్టి మరల్చే కుట్ర

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 01, 2023 04:59 PM IST

APCC Latest News: బీజేపీ మొసలి కన్నీరుని ప్రజలు గమనిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. గ్యాస్ ధర పెంపుతో రూ.8.33 లక్షల కోట్ల దోపిడీ చేశారని... ఎన్నికలముందు పేదలపై సవతి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు.

 ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు
ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు

APCC President Gidugu Rudra Raju: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఎన్నికల నాటకాలను ప్రజలందరూ గమనిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. దేశంలో త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకుని, గత పదేళ్లలో రెట్టింపు చేసిన గ్యాస్ బండ ధరపై హటాత్తుగా రూ.200 తగ్గించారని అన్నారు. ఈ మేరకు శుక్రవారం పీసీసీ అధ్యక్షులు ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ మొసలి కన్నీరును, అదే విధంగా ఎన్నికల ముందు పేదలపై కురిపిస్తున్న సవతి తల్లి ప్రేమను అందరూ గమనిస్తున్నారని తెలిపారు. అదానీ అక్రమ ఆర్థిక లావాదేవీలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నేపధ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కంటి తుడుపు చర్యగా రూ.200 తగ్గిస్తున్నామని కేంద్రం ప్రకటించిందని ప్రస్తావించారు.

ట్రెండింగ్ వార్తలు

"ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నా దేశం లక్షల కోట్ల రూపాయిల అప్పుల్లో కూరుకుపోయిన దానిపై కేంద్రం సమాధానం చెప్పాలి. 2014 కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి దిగే సమయానికి గ్యాస్ సిలెండర్ ధర రూ.480 ఉండేది. గత పదేళ్ల కాలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచుతూ ప్రస్తుతానికి రూ.1053 చేసింది. వంటకు వాడుకునే ఆయిల్ ధరలు 2014 నుంచి 2023 నాటికి లీటర్ రూ.35 నుంచి రూ. 120కు చేరింది. గత పదేళ్లలో పెట్రోల్ ధరలు కూడా రూ.66 నుంచి రూ.110కు పెరిగాయి. దశాబ్ధకాలంలో అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు మాత్రం బ్యారెల్ కు 101 డాలర్ల నుంచి 86 డాలర్లకు తగ్గిన విషయాన్ని అందరూ గమనించాలి" అని ప్రజలను కోరారు.

గ్యాస్ ధరల పెంపుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ.8,33,640 కోట్లను పేదల నుంచి దోపిడీ చేసిందని గిడుగు రుద్రరాజు విమర్శించారు. ఉజ్వల పథకం కింద 2017 నుంచే రూ.68,702 కోట్ల ప్రజా ధనాన్ని లూఠీ చేశారని వెల్లడించారు. 2020 నుంచి నగదు బదిలీ పథకం అంటూ కనీసం సబ్సిడీ కూడా సరిగ్గా అందించడం లేదన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు తీవ్ర ఆక్షేపణీయంగా ఉందన్నారు. మణిపూర్ లో క్రైస్తవులు, గిరిజనులపై జరిగిన దాడులు విష‍యంలోనూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కనీసం ఒక మాట మాట్లాడక పోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ కేసుల భయంతో కేంద్రం అడుగులకు మడుగులెత్తుతున్నారని విమర్శించారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు.

WhatsApp channel