YS Sharmila On CM CBN : చంద్రబాబు గారు.... ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు, చక్కర్లు ఎందుకు కొడుతున్నారు..? వైఎస్ షర్మిల
YS Sharmila On CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కేంద్రంలో చక్రం తిప్పాల్సింది పోయి… ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడమేంటని ప్రశ్నించారు.
YS Sharmila On CM Chandrababu : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుంది సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఉన్నాయంటూ విమర్శించారు. ఎన్డీయే కూటమిలో పెద్దన్న పాత్రగా... ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు, ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు..? అని ప్రశ్నించారు.
ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నట్లు..? అని సీఎం చంద్రబాబుని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా.. మోడీతో గానీ ,ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేక పోయారని నిలదీశారు.
గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా ? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. "విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పెద్దలతో చెప్పించ గలిగారా... ? పోలవరం ప్రాజెక్ట్ కి నిధులపై స్పష్టత ఇచ్చారా ? రాజధాని నిర్మాణం పై కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పగలిగారా..?" అంటూ నిలదీశారు.
“ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న.. దాటక బోడి మల్లన్న “. ఇదే బీజేపీ సిద్ధాంతం. చంద్రబాబు గారు ఇప్పటికైనా కళ్లు తెరవడం మంచింది. మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు అడుకుంటుంది అని గుర్తిస్తే మంచిది" అని వైఎస్ షర్మిల హితవు పలికారు.
ఢిల్లీలో చంద్రబాబు:
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. విభజన హామీలు, అమలు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై చర్చించారు. దాదాపు గంటకు పైగా బాబు, అమిత్ షా భేటీ కొనసాగింది.
ఏపీ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఇతోదికంగా సాయం చేయాలని చంద్రబాబు అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. జూలై 23న పార్లమెంటులో ప్రవే శపెట్టే బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సాయం అందించాలని ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రి 9 గంటలకు కృష్ణమీనన్ మార్గ్‌లోని హోం మంత్రి నివాసంలో సిఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.
గంటకుపైగా సాగిన ఈ సమావేశంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున, ఆ పరిస్థితి నుంచి గట్టెక్క డానికి రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాలని కోరారు. విభజన చట్టంలో హామీల అమలు, ఇరు రాష్ట్రాల మధ్య ప్రతిష్టంబన నెలకొన్న అంశాలను వేగంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
అమిత్‌షాతో భేటీ తర్వాత సిఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 'ఐదేళ్లలో ఆంధ్ర ప్రదేశ్ దెబ్బతిన్న వైనం, రాష్ట్రంలో తలెత్తిన విధ్వంసక పరిస్థితుల గురించి తెలియజేయడానికి హోం మంత్రి అమిత్ షాను కలిసినట్టు అందులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన నాలుగు శ్వేతపత్రాల్లోని అంశాలపై చర్చించామని, 2019-24 మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయిన అప్పుల భారం, దానివల్ల రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు చేయి దాటిపోయిన విషయాన్ని వివరించానని తెలిపారు.