Digital Payments : నెలాఖరుకు మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్.....
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నెలాఖర్లోగా డిజిటల్ చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపిబిసిఎల్ ప్రకటించింది. సాంకేతిక కారణాలతోనే ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ ఆలశ్యమైందని, ఆగష్టు చివరి నాటికి ఆన్‌లైన్ చెల్లింపులు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో త్వరలో డిజిటల్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఏపిబిసిఎల్ ఎండి వాసుదేవరెడ్డి ప్రకటించారు. ఆగష్టు చివరి నాటికి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ ఆన్‌లైన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిఎఫ్‌ఎంఎస్‌ల మధ్య నెట్‌వర్క్ ఏర్పాటులో సాంకేతిక సమస్యలు ఎదురవడం వల్ల డిజిటల్ పేమెంట్లలో జాప్యం జరుగుతున్నట్లు చెప్పారు. క్యాష్‌లెస్ లావాదేవీల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించారు.
ఏపీలో ప్రస్తుతం 2934 మద్యం దుకాణాలను ఏపిబిసిఎల్ నిర్వహిస్తోంది. సగటున రోజుకు వీటిలో రూ.70కోట్ల రుపాయల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయి.నిరంతరం వీటిపై పర్యవేక్షణ కొనసాగించడం కత్తిమీద సాములా మారింది. థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహించడంతో పాటు ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణ కూడా కొనసాగిస్తున్నా అడపాదడపా నగదు లావాదేవీల్లో సమస్యలు తలెత్తుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 2021-22లో ఏపిబిసిఎల్ 25వేల కోట్ల రుపాయల విలువైన మద్యం వ్యాపారాన్ని నిర్వహించింది. ఇది మద్యం ద్వారా సాధించిన రికార్డు స్థాయి ఆదాయమని ఏపిబిసిఎల్ చెబుతోంది. అదే సమయంలో ఏపిఆన్లైన్, సిఎఫ్‌ఎంఎస్, ఎస్‌బిఐలతో ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాలను పర్యవేక్షిస్తున్న ఏపిబిసిఎల్ 25వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించడాన్ని కూడా సమర్ధించుకుంటోంది. ప్రభుత్వ విధానంలో భాగంగా మద్యం వినియోగాన్ని గణనీయంగా తగ్గించినా ఆదాయం మాత్రం భారీగా పెరిగిందని చెబుతున్నారు. మద్యం ధరలు పెంచడం వల్లే ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని ఏపిబిసిఎల్ చెబుతోంది.
ప్రభుత్వం మద్యం ధరల్ని గణనీయంగా పెంచడం వల్ల పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మద్యం తరలించడం మొదలవడంతో ధరల్ని తగ్గించాల్సి వచ్చిందని ఏపిబిసిఎల్ చెబుతోంది. దాదాపు లక్షన్నర కేసుల్ని ఇలా అక్రమంగా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తరలిస్తున్నదుకు నమోదు చేశారని ఆ తర్వాత ధరల్ని తగ్గించినట్లు ఏపిబిసిఎల్ చెబుతోంది. మరోవైపు ఏపీలో తయారవుతున్న మద్యం హానీకరమని జరుగుతున్న ప్రచారాన్ని ఏపిబిసిఎల్ తోసిపుచ్చింది. చెన్నైలో పరీక్షలు నిర్వహించిన ల్యాబ్ తమ నివేదికలో ఆంధ్రాలో తయారవుతున్న మద్యం కొన్ని రసాయినాలను మాత్రమే కనుగొన్నట్లు వివరణ ఇచ్చిందని చెబుతోంది. ఇతర రాష్ట్రాలలో తయారవుతున్న మద్యం మాదిరే ఏపీలో తయారైన మద్యం కూడా సురక్షితమైందని ఏపీబీసిఎల్ చెబుతోంది. ఏపీ మద్యంపై తరచూ విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మద్యం నాణ్యతా పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఏపిబిసిఎల్ భావిస్తోంది.