AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, డిసెంబర్ 15 వరకు ఏపీలో వర్షాలు
AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అల్పపీడనం బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని తెపింది. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
అల్పపీడన వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటని వర్షాలకు ముందు కోయరాదన్నారు. కోసినా పూర్తిగా ఆరని పనలను వర్షాల నేపథ్యంలో కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేసుకోవడం వల్ల నష్ట శాతాన్ని నివారించుకోవచ్చన్నారు.
రైతులకు సూచనలు
కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లైతే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేవిధంగా పిచికారీ చేయాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు, చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు, బాదులతో సపోర్ట్ అందించాలని తెలిపారు. వ్యవసాయ సంబంధిత ఇతర సందేహాలు నివృత్తి కోసం మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని సూచించారు. వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
బుధ, గురువారాల్లో వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రంపై అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
ఈ నెల 14 లేదా 15 తేదీలలో అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది 16, 17వ తేదీల నాటికి ఏపీ, తమిళనాడు వైపు పయనిస్తుందని, దీని ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యపేట జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.
సంబంధిత కథనం