డ్రైవర్ల సంక్షేమం కోసం ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకానికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం రూపొందించింది. ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇవ్వనున్నారు.
ఈ పథకాన్ని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తో పాటు కూటమి నేతలు హాజరవుతారు.
అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం అందేలా చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేకుంటే... వారి సమస్యను పరిష్కరించిన వెంటనే లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు.
దీని కోసం ప్రత్యేకంగా ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాట్సాప్ ద్వారా ఒక ప్రత్యేక గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సంబంధిత కథనం