AP Tourism Temple Tour Package : ఏపీ టూరిజం సరికొత్త ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ, ఒకే రోజులో 6 ప్రముఖ ఆలయాల సందర్శన-ap tourism temple tour package one day six famous temple in east godavari covered ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tourism Temple Tour Package : ఏపీ టూరిజం సరికొత్త ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ, ఒకే రోజులో 6 ప్రముఖ ఆలయాల సందర్శన

AP Tourism Temple Tour Package : ఏపీ టూరిజం సరికొత్త ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ, ఒకే రోజులో 6 ప్రముఖ ఆలయాల సందర్శన

AP Tourism Temple Tour Package : అక్టోబర్ 26 నుంచి ఏపీ టూరిజం టెంపుల్ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఒక రోజులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6 ఆధ్యాత్మిక ఆలయాలను కవర్ చేయవచ్చు.

ఏపీ టూరిజం సరికొత్త ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ, ఒకే రోజులో 6 ప్రముఖ ఆలయాల సందర్శన

ఏపీ టూరిజం అక్టోబర్ 26 నుంచి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కుందల దుర్గేష్ ఓ ప్రకటన చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు, పంచారామ క్షేత్రాలను కవర్ చేస్తూ ఒక రోజు వీకెండ్ టూర్ ప్యాకేజీకి అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి తెలిపారు. 6 పుణ్య క్షేత్రాలతో ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ ప్రవేశపెట్టాలని నిర్ణయించామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను కలుపుతూ ప్రతి శనివారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందన్నారు. ఇందుకోసం ఏపీ టూరిజం ప్రత్యేక బస్సులు నడుపుతుందన్నారు.

భక్తులు, పర్యాటకుల రద్దీ, డిమాండ్ దృష్ట్యా ఆదివారం కూడా బస్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. రాజమండ్రిలోని సరస్వతీ ఘాట్ వద్ద టూరిజం శాఖ ఆఫీస్ నుంచి ఉదయం 6 గంటలకు బస్సులు బయలుదేరి, తిరిగి రాత్రి 7.30గంటలకు ప్రయాణం ముగుస్తుందన్నారు. అతి త్వరలోనే ఈ బస్సులను ప్రారంభిస్తామన్నారు. ఈ టూర్ ప్యాకేజీలో పెద్దలకు రూ.1,000, 3 నుంచి 10 ఏళ్ల వయస్సు గల పిల్లలకు రూ. 800 టికెట్ ధరగా నిర్ణయించామన్నారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రకృతి అందాలను వీక్షిస్తూ సాగే ఈ టూర్ ప్యాకేజీ పర్యాటకులను ఆకట్టుకుంటుందన్నారు.

టూర్ వివరాలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి చెందిన, పురాతన క్షేత్రమైన కోరుకొండ స్వయం భూ శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామిని ముందుగా దర్శించుకుంటారు. అనంతరం రత్నగిరి కొండపై వెలసిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శనించారు. ఆ తర్వాత పాదగయ తీర్థంగా పేరొందిన పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయం, పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయాన్ని పర్యాటకులు దర్శించుకుంటారు. సామర్లకోట ఆలయంలో మధ్యాహ్నం అన్న ప్రసాదాలు స్వీకరిస్తారు.

అనంతరం శైవ క్షేత్రం ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత కోనసీమ తిరుపతి, ఏడు శనివారాల వెంకన్న వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించుకుంటారు. అక్టోబర్ 26 నుంచి ఈ టూర్ బస్సులు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

18 మందికి బస్సు

ప్రతి శనివారం రాజమండ్రి సరస్వతీ ఘాట్ వద్ద పర్యాటక శాఖ ఆఫీసు వద్ద నుంచి ఉదయం 6 గంటలకు బస్సులు బయలుదేరి కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను సందర్శించి, రాత్రి 7.00 గంటలకు రాజమండ్రి హేవలాక్ బ్రిడ్జి దగ్గర పుష్కర్ ఘాట్‌కు చేరుకుంటాయి. పర్యాటకులు గోదావరి నది హారతి తిలకించేలా ఏర్పాట్లు చేస్తారు. రాత్రి 7.30 గంటలకు రాజమండ్రి ఇన్‌ఫ‌ర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం వద్దకు పర్యాటకులను తీసుకొస్తారు. దీంతో టూర్ పూర్తవుతుంది. 18 మంది సీటింగ్ సామర్థ్యంతో బస్సులు అందుబాటులో ఉంటాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రకృతి అందాలను వీక్షిస్తూ సాగే ఆధ్యాత్మిక యాత్ర భక్తులకు మాసిక ఆనందాన్ని కలిగిస్తాయన్నారు. సమూహాలుగా భక్తులు సంప్రదిస్తే ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తామన్నారు.

ఈ టూర్ ప్యాకేజీ కోసం పర్యాటకులు ఏపీ టూరిజం వెబ్ సైట్ https://tourism.ap.gov.in/tours లేదా ఫోన్ నెంబర్ ను 180042545454 సంప్రదించవచ్చు.