AP Tourism : తిరుపతి నుంచి కొత్తగా నాలుగు బస్ ప్యాకేజీలు.. తక్కువ ధరలకే యాత్రకు వెళ్లొచ్చు!
AP Tourism : బస్ ప్యాకేజీల ద్వారా తిరుమల దర్శన టిక్కెట్లు రద్దయ్యాయి. దీంతో ఆర్థికంగా నష్టపోయిన ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ.. తమకు చెందిన బస్సులను ఇతర మార్గాల్లో నడిపేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే తిరుపతి నుంచి కొత్తగా నాలుగు బస్ ప్యాకేజీలను ప్రకటించింది.
భక్తులు, పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి నుంచి కొత్తగా నాలుగు బస్ ప్యాకేజీలను ప్రకటించింది. తిరుపతి నుంచి కోయంబత్తూర్‌కు ప్రతి బుధవారం బస్సును నడిపేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. నాలుగు రోజుల పాటు ఈ యాత్ర ఉంటుంది.
కన్యాకుమారి మీదుగా..
తిరుపతి నుంచి మైసూర్‌కు కూడా ప్రతి బుధవారం బస్సు నడపనున్నారు. తిరుపతి నుంచి కన్యాకుమారి మీదుగా మదురైకి ప్రతి గురువారం ఇంకో బస్సు బయలు దేరుతుంది. తిరుపతి నుంచి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలానికి రోజూ మరో బస్సు కొత్తగా నడపనున్నామని అధికారులు వెల్లడించారు. వీటికి సంబంధించి నాలుగు రోజుల పాటు యాత్ర ఉంటుంది. ఈ యాత్రలో భాగంగా.. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజన సదుపాయం, వసతి కల్పిస్తారు.
ఒక్కో బస్సులో 40 సీట్లు..
మల్టీ యాక్సిల్ ఏసీ వాల్వో ఒక్కో బస్సులో 40 సీట్లు ఉంటాయని టూరిజం డిపార్ట్‌మెంట్ అధికారులు వివరించారు. ఏపీటీడీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్‌లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు. టికెట్ల ధర, ఇతర వివరాలకు 98480 07024, 98488 50099, 98489 73985 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని పర్యాటక శాఖ అధికారులు సూచించారు.
తిరుపతి నుంచి..
కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్‌కు రెండు రూట్లలో బస్సులు నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఏపీ, తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఈ బస్సులను నడుపుతామని వివరించారు. ఇందులో ఓ బస్సు తిరుపతి, ఒంటిమిట్ట, కడప బైపాస్, ఓర్వకల్లు, కర్నూల్ బైపాస్, హైదరాబాద్, జబల్‌పూర్, చిత్రకూటం, కాశీ, నాగపురి ధర్మపురి మీదుగా ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటుంది. ఈ బస్సు ఫిబ్రవరి 11 ఉదయం 6గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది.
నెల్లూరు నుంచి..
దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు సీఆర్‌వో, తిరుపతి, 98480 07033, కడప డీజీఎం 90103 18811, కర్నూలు డీవీఎం 96401 77759, హైదరాబాద్ ఐఆర్‌వోలను సంప్రదించాలని అధికారులు సూచించారు. రెండో రూట్ బస్సు ఫిబ్రవరి 12న ఉదయం 6గంటలకు నెల్లూరు రాజరాజేశ్వరి ఆలయం నుంచి బయలుదేరుతుంది. ఈ బస్సు నెల్లూరు నుంచి విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం, పూరి, కోణార్క్, భువనేశ్వర్, కటక్, చండీపూర్, గయ, బుద్ధగయ, కాశీ, ప్రయాగ్‌రాజ్‌కు వెళుతుంది.